వారణాసిలో విదేశీ విద్యార్థిని అనుమానాస్పద మృతి.. పోలీసులు ఏం చెప్పారంటే..

by Naga Rani Yarlagadda |

వారణాసిలోని బనారస్ హిందూ విశ్వవిద్యాలయం (BHU)లో ఫిలాసఫీలో పీహెచ్ డీ చదువుతున్న 27 ఏళ్ల రొమేనియన్ విద్యార్థుని గురువారం (సెప్టెంబర్ 11) రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది.

వారణాసిలో విదేశీ విద్యార్థిని అనుమానాస్పద మృతి.. పోలీసులు ఏం చెప్పారంటే..
X

దిశ, వెబ్‌డెస్క్: వారణాసిలోని బనారస్ హిందూ విశ్వవిద్యాలయం (BHU)లో ఫిలాసఫీలో పీహెచ్ డీ చదువుతున్న 27 ఏళ్ల రొమేనియన్ విద్యార్థుని గురువారం (సెప్టెంబర్ 11) రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో రొమేనియాకు చెందిన ఫిలిపా ఫ్రాన్సిస్కా అనే విద్యార్థిని నివసిస్తోంది. ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన యజమాని తలుపు ఎంతకొట్టిన తీయకపోవడంతో.. పోలీసులకు సమాచారమిచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు డూప్లికేట్ తాళంతో తలుపులను తెరచి చూసేసరికి ఫ్రాన్సిస్కా.. మంచంపై నిర్జీవంగా పడి కనిపించింది.

మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కు తరలించి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక దర్యాప్తులో ఆమెకు మెడికల్ హిస్టరీ ఉన్నట్లు తెలుసుకున్నారు. కానీ గదిలో అందుకు సంబంధించిన మెడిసిన్, లేదా సూసైడ్ లెటర్ కానీ దొరక్కపోవడంతో ఫ్రాన్సిస్కా మృతిపై అనుమానాలు పెరిగాయి. పోలీస్ ఆఫీసర్ అతుల్ అంజన్ త్రిపాఠి.. ఫ్రాన్సిస్కాకు చిన్నప్పటి నుంచే మూర్చవ్యాధి ఉందని తెలిపారు. ఆమె వీసా, పాస్ పోస్ట్, మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నామన్నారు. గతంలో ఆమె సూరత్, అమృత్ సర్ లలో చదువుకున్నట్లు తెలిసిందన్నారు. ఫ్రాన్సిస్కా మృతి విషయాన్ని రొమేనియన్ రాయబార కార్యాలయానికి, యూనివర్శిటీ వారికి తెలిపారని, కుటుంబ సభ్యుల్ని కాంటాక్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

Next Story