కోహ్లీ, రోహిత్ ఫామ్‌పై ఆందోళన

by Ajay Maddhiboyina |   (  Updated:2025-02-04 17:55:27  IST  )

భారత జట్టులోని అగ్రశేణి బ్యాటరు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫామ్‌పై ఆందోళన నెలకొంది. ఇంగ్లాంత్‌తో జరుగనున్న వన్డే సిరీస్‌లో ఈ ఇద్దరు బ్యాటర్లకు ఒక సువర్ణావకాశం అనే చెప్పవచ్చు.

కోహ్లీ, రోహిత్ ఫామ్‌పై ఆందోళన
X

- వికెట్ కీపర్‌గా ఛాన్స్ ఎవరికి?

- జడేజా ఫిట్‌గా ఉన్నాడా?

- ఆరు నెలల తర్వాత వన్డే ఆడనున్న టీమ్ ఇండియా

- గురువారం నుంచి ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్

దిశ, స్పోర్ట్స్: ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను 4-1 తేడాతో గెలిచిన టీమ్ ఇండియా.. ఇక వన్డే పోరుకు సిద్ధమవుతోంది. ఇంగ్లాండ్‌తో గురువారం (ఫిబ్రవరి 6) నుంచి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ప్రారంభం కానుంది. చాంపియన్స్ ట్రోఫి 2025కు ముందు భారత్ ఆడనున్న వన్డే సిరీస్ కావడంతో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నిరుడు ఆగస్టులో భారత జట్టు చివరి సారిగా శ్రీలంకతో వన్డే సిరీస్ ఆడింది. మూడు మ్యాచ్‌ల ఆ సిరీస్‌ను భారత్ 0-2 తేడాతో ఓడిపోయింది. ఇప్పుడు మళ్లీ ఆరు నెలల తర్వాత వన్డే సిరీస్ ఆడబోతుండటంతో భారత జట్టు ప్రదర్శన ఎలా ఉంటుందో అనే ఆసక్తి నెలకొంది. ఈ నెల 19 నుంచి చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానున్న నేపథ్యంలో జట్టు కూర్పును సరి చూసుకోవడానికి, ఆత్మవిశ్వాసం పెంచుకోవడానికి ఇంగ్లాండ్‌తో సిరీస్ ఉపయోగపడనుంది. కీలకమైన ఈ సిరీస్‌లో భారత జట్టును ఆందోళన పెడుతున్న అంశాలు ఉన్నాయి. వికెట్ కీపర్‌గా ఎవరి సేవలు ఉపయోగించుకోవాలి, బౌలింగ్ విభాగంలో సమతుల్యత ఏ విధంగా తీసుకొని రావాలనే విషయాలపై టీమ్ మేనేజ్‌మెంట్ కసరత్తు చేస్తోంది.

అగ్రశ్రేణి బ్యాటర్ల ఫామ్‌పై ఆందోళన

భారత జట్టులోని అగ్రశేణి బ్యాటరు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫామ్‌పై ఆందోళన నెలకొంది. ఇంగ్లాంత్‌తో జరుగనున్న వన్డే సిరీస్‌లో ఈ ఇద్దరు బ్యాటర్లకు ఒక సువర్ణావకాశం అనే చెప్పవచ్చు. చాంపియన్స్ ట్రోఫీ ముందు తమ బ్యాటింగ్ గాడిన పెట్టుకోవడానికి వన్డే సిరీస్ తప్పకుండా ఉపయోగపడుతుంది. ఆస్ట్రేలియా పర్యటనలో ఇద్దరు కూడా బ్యాటింగ్‌లో ఇబ్బందులు పడ్డారు. కోహ్లీ ఒక్క సెంచరీ తప్ప.. చాలా వరకు విఫలమయ్యాడు. ఆఫ్ స్టంప్ ఆవతల పడే బంతులను పదే పదే ఛేజ్ చేస్తూ అవుటవుతున్నాడు. ఇక రైల్వేస్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ 6 పరుగులకే పెవీలియన్ చేరాడు. ఆస్ట్రేలియా పర్యటన నుంచి ఒకే విధంగా కోహ్లీ అవుటవడం అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. దీంతో ఆర్సీబీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ భంగర్‌తో కలిసి రంజీ ట్రోఫీ మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ చేశాడు. కానీ ఆ మ్యాచ్‌లో కూడా పూర్తిగా విఫలమయ్యాడు.

ఇక రోహిత్ శర్మ కూడా మునుపటి దూకుడు కనపరచడం లేదు. దేశవాళీ రంజీ ట్రోఫీలో ఆడి లోపాలను సరిదిద్దుకుందామని భావించాడు. అయితే జమ్ము కశ్మీర్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ 3, 28 పరుగులు మాత్రమే చేశాడు. వన్డే క్రికెట్‌లో రోహిత్ శర్మ రికార్డులు అద్బుతంగా ఉన్నాయి. ఓపెనర్‌గా రోహిత్ రాణిస్తే జట్టుకు విజయం తప్పనిసరిగా అందుతుంది. అలాగే ఫస్ట్ డౌన్‌లో వచ్చే కోహ్లీకి కూడా వన్డేలో మంచి రికార్డు ఉంది. ఇక రోహిత్‌కు తోడుగా మరో ఓపెనర్‌గా శుభ్‌మన్ గిల్ బరిలోకి దిగుతాడు. నంబర్ 3లో కోహ్లీ, నంబర్ 4లో శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఆల్ రౌండర్ కోటాలో హార్దిక్ పాండ్యాకు చోటు దక్కుతుంది.

వికెట్ కీపర్‌పై డైలమా..

ఇంగ్లాండ్‌తో జరిగే సిరీస్‌లో వికెట్ కీపర్‌గా ఎవరి సేవలు ఉపయోగించుకుంటారనే విషయంలో డైలమా నెలకొంది. రిషబ్ పంత్‌కు యాక్సిడెంట్ అయిన తర్వాత 2023 ఆగస్టు నుంచి వన్డేల్లో కేఎల్ రాహుల్ కీపింగ్ చేస్తున్నాడు. రోడ్డు ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత పంత్‌ను శ్రీలంకతో సిరీస్‌కు ఎంపిక చేశారు. కానీ పంత్ కేవలం ఒకే మ్యాచ్ ఆడి 6 పరుగులు చేశాడు. ఇక ఫామ్ పరంగా చూస్తే.. ఇద్దరూ ఒక మోస్తారుగానే ఆడుతున్నారు. అయితే రంజీ ట్రోఫీలో కర్ణాటక తరపున బరిలోకి దిగిన కేఎల్ రాహుల్ 26, 43 పరుగులు చేశాడు. పంత్ సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో 1, 17 పరుగుల మాత్రమే చేయగలిగాడు. దీంతో ఇద్దరిలో ఎవరికి తుది జట్టులో చోటు దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది.

బౌలర్లుగా ఎవరు?

జస్ప్రిత్ బుమ్రా సిడ్నీ టెస్టులో గాయపడటంలో అతనికి విశ్రాంతి ఇచ్చారు. కేవలం మూడో వన్డేకు మాత్రమే అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఇక గాయాల నుంచి కోలుకున్న మహ్మద్ షమి తిరిగి వన్డే జట్టులోకి వచ్చాడు. అతను 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత మరో మ్యాచ్ ఆడలేదు. టీ20 సిరీస్ మొత్తం కలిపి 5.3 ఓవర్లు మాత్రమే వేశాడు. అర్షదీప్ సింగ్ ఇప్పటి వరకు ఎనిమిది వన్డేలు మాత్రమే ఆడాడు. దీంతో తుది జట్టులో షమీకే చోటు దక్కే అవకాశం కనిపిస్తోంది. ఇక చికిత్స అనంతరం కోలుకున్న కుల్దీప్ యాదవ్‌కు తుది జట్టులో చోటు దక్కుతుందో లేదో చూడాలి. రవీంద్ర జడేజా 2023 నుంచి వన్డేలు ఆడలేదు. ఆ సమయంలో భారత జట్టు స్పిన్ బాధ్యతలను అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్‌లు మోశారు. మరి వీరిలో ఎవరికి తుది జట్టులో స్థానం కల్పిస్తారో చూడాలి.

జట్టులోకి వరుణ్ చక్రవర్తి

ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో అద్భుతంగా రాణించిన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని వన్డే జట్టులోకి తీసుకుంటున్నట్లు టీమ్ ఇండియా వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ స్పష్టం చేశాడు. నాగ్‌పూర్‌లో తొలి వన్డే కోసం ప్రాక్టీస్ చేస్తున్న భారత జట్టుతో వరుణ్ చక్రవర్తి కూడా కనిపించాడు. ప్రాక్టీస్ సెషన్ తర్వాత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వరుణ్ చక్రవర్తిని వన్డే జట్టులో చేర్చినట్లు గిల్ చెప్పాడు. ఫామ్‌లో ఉన్న వరుణ్‌ను ఇంగ్లాండ్‌తో జరుగనున్న వన్డే సిరీస్‌లోకి తీసుకోవాలని టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయించినట్లు గిల్ పేర్కొన్నాడు. అయితే అతను చాంపియన్స్‌ ట్రోపీలో ఆడతాడా లేడా అనేది మాత్రం గిల్ చెప్పలేదు. చాంపియన్స్ ట్రోఫీలో ఆడే తుది జట్టును ఫిబ్రవరి 12న ప్రకటించనున్నారు. వన్డే సిరీస్‌లో ఆటగాళ్ల ప్రదర్శనను బట్టి తుది జట్టుకు ఎంపిక చేయనున్నారు.

వన్డే సిరీస్ షెడ్యూల్

తొలి వన్డే - ఫిబ్రవరి 6 - నాగ్‌పూర్

రెండో వన్డే - ఫిబ్రవరి 9 - కటక్

మూడో వన్డే - ఫిబ్రవరి 12 - అహ్మదాబాద్

*అన్ని వన్డేలు డే/నైట్ మ్యాచ్‌లు

** మ్యాచ్‌లు స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్/ డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతాయి

Next Story