Robert Vadra: ఈడీ విచారణకు రాబర్ట్ వాద్రా.. ఆరు గంటల పాటు ప్రశ్నించిన దర్యాప్తు సంస్థ

by vinod kumar |
Robert Vadra: ఈడీ విచారణకు రాబర్ట్ వాద్రా.. ఆరు గంటల పాటు ప్రశ్నించిన దర్యాప్తు సంస్థ
X

దిశ, నేషనల్ బ్యూరో: మనీలాండరింగ్ కేసులో భాగంగా కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా (Robert Vadra) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. 2008లో హర్యానాలో జరిగిన భూ కుంభకోణానికి సంబంధించిన కేసులో ఆయనను ఆరు గంటల పాటు అధికారులు ప్రశ్నించారు. మంగళవారం ఈడీ సమన్లు జారీ చేసిన వెంటనే ఆయన ఢిల్లీలోని దర్యాప్తు సంస్థ కార్యాలయానికి వెళ్లారు. ఉదయం 11 గంటలకు ఈడీ ఆఫీసుకు వెళ్లిన రాబర్డ్ సాయంత్రం 6 గంటలకు బయటకు వచ్చారు. అనంతరం బుధవారం విచారణకు హాజరుకావాలని సమన్లు జారీ చేశారు. దీంతో ఆయన మరోసారి ఇన్వెస్టిగేషన్‌కు హాజరయ్యే అవకాశం ఉంది.

ఈడీ విచారణకు హాజరయ్యే క్రమంలో రాబర్డ్ వాద్రా మీడియాతో మాట్లాడారు. ఈ కేసు 20 ఏళ్ల నాటిదని తెలిపారు. రాజకీయ ప్రతీకారంలో భాగంగా తనను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించారు. ‘నేను ప్రజల తరఫున గొంతు వినిపించినప్పుడు, రాజకీయాల్లోకి రావడానికి ప్రయత్నించిన ప్రతి సారి సమన్లు జారీ చేస్తారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడం ప్రారంభిస్తారు. ఈ కేసులో ఏమీ లేదు. ఏదైనా గుర్తించడానికి 20 ఏళ్లు పట్టదు. గతంలో 15 సార్లు విచారణకు హాజరయ్యా. 23,000 పత్రాలను సమర్పించా. ఇది రాజకీయ ప్రతీకారం తప్ప మరొకటి కాదు’ అని వ్యాఖ్యానించారు.

కాగా, 2008 ఫిబ్రవరిలో రాబర్ట్ వాద్రాకు చెందిన కంపెనీ స్కైలైట్ హాస్పిటాలిటీ గురుగ్రామ్‌లోని షికోహాపూర్ గ్రామంలో 3.5 ఎకరాల భూమిని ఓంకారేశ్వర్ ప్రాపర్టీస్ నుంచి రూ.7.5 కోట్లకు కొనుగోలు చేసింది. అనంతరం అప్పటి ప్రభుత్వం ఈ భూమిలో కాలనీని అభివృద్ధి చేయడానికి లైసెన్స్ ఇచ్చింది. కానీ కాలనీని నిర్మించడానికి బదులుగా ఈ భూమిని రూ. 58 కోట్లకు విక్రయించింది. అయితే ఈ ఒప్పందంలో అవకతవకలు జరిగాయని ఆరోపణలున్నాయి.



Next Story

Most Viewed