- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాబర్ట్ వాద్రాకు ఊరట.. మనీ లాండరింగ్ కేసులో బెయిల్ మంజూరు
గురుగ్రామ్ శిఖోపూర్ భూ కుంభకోణం, మనీలాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రాకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

దిశ, వెబ్ డెస్క్: హర్యానాలోని గురుగ్రామ్ భూ కుంభకోణం, మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ భర్త, ప్రముఖ వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా (Robert Vadra)కు ఉపశమనం కలిగింది. ఈ రోజు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరైన ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. హర్యానాలోని గురుగ్రామ్ (గుర్గావ్) పరిధిలో ఉన్న శిఖోపూర్ గ్రామంలో 2008లో జరిగిన 3.53 ఎకరాల ల్యాండ్ డీల్ చుట్టూ ఈ వివాదం నడుస్తోంది. రాబర్ట్ వాద్రాకు చెందిన 'స్కై లైట్ హాస్పిటాలిటీ' (Sky Light Hospitality) సంస్థ, ఒంకార్వేగర్ ప్రాపర్టీస్ నుండి ఈ భూమిని కొనుగోలు చేసింది.
ఈ ల్యాండ్ డీల్ సమయంలో తప్పుడు పత్రాలు సమర్పించారని, ఎలాంటి నగదు చెల్లించకుండానే (unencashed cheque ద్వారా) లావాదేవీలు జరిపారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఆరోపించింది. వాద్రా తన రాజకీయ ప్రభావాన్ని ఉపయోగించి ఈ భూమికి కమర్షియల్ లైసెన్స్ పొంది.. ఆ తర్వాత 'డీఎల్ఎఫ్' (DLF) సంస్థకు భారీ లాభానికి విక్రయించారని, దీని ద్వారా రూ. 58 కోట్ల పిఎంఎల్‌ఏ (PMLA) నేరపూరిత సొమ్ము (Proceeds of Crime) ఆర్జించారని ఈడీ చార్జ్‌షీట్‌లో పేర్కొంది. ఈ కేసులో దర్యాప్తు సంస్థ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకున్న ప్రత్యేక కోర్టు.. రాబర్ట్ వాద్రాకు సమన్లు జారీ చేస్తూ మే 16న వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది
. కోర్టు ఆదేశాల ప్రకారం శనివారం రౌస్ అవెన్యూ కోర్టుకు హాజరైన వాద్రాకు రూ. 50,000 వ్యక్తిగత పూచీకత్తు, అంతే మొత్తానికి సమానమైన ఒక షూరిటీ సమర్పించాలనే షరతుపై ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ లభించిన అనంతరం రాబర్ట్ వాద్రా మీడియాతో మాట్లాడుతూ.. దేశ న్యాయవ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు. అయితే దర్యాప్తు సంస్థ అయిన ఈడీ (ED) పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చేతుల్లో నడుస్తోందని, ప్రభుత్వం చెప్పిన సూచనల ప్రకారమే తనను ఇబ్బంది పెట్టేందుకు ఈడీ వ్యవహరిస్తోందని ఆరోపించారు. తన వద్ద దాచడానికి ఏమీ లేదని రాబర్ట్ వాద్రా స్పష్టం చేశారు.






