China: భవిష్యత్తులో పరిస్థితులు చైనాకు కఠినంగా ఉండొచ్చు: అధ్యక్షుడు జిన్‌పింగ్

by S Gopi |
China: భవిష్యత్తులో పరిస్థితులు చైనాకు కఠినంగా ఉండొచ్చు: అధ్యక్షుడు జిన్‌పింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో: భవిష్యత్తులో చైనా కఠిన పరిస్థితులను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయని ఆ దేశ అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ అన్నారు. చైనా 75వ జాతీయ దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రసంగించిన ఆయన.. అమెరికాతో ఉన్న పోటీతో పాటు భారత్, ఇతర పొరుగు దేశాలతో ఉన్న ఉద్రిక్తతలు, ఆర్థికపరమైన ప్రతికూల గాలుల కారణంగా దేశం మున్ముందు అంత సజావుగా కొనసాగగలదనే సందేహం కలుగుతోంది. 'మనం అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాం. రానున్న రోజుల్లో అడ్డంకులు, కఠిన సందర్భాలు ఉండే అవకాశం ఉంది. ఇలాంటి సమయాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి. క్లిష్టమైన సమయాలకు సిద్ధం కావాలని' ప్రజలనుద్దేశించి చెప్పారు. ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని, మొత్తం కమ్యూనిస్ట్ పార్టీ, సైన్యం, దేశంలోని ప్రజలు కలిసికట్టుగా ఉంటే ఎలాంటి అడ్డంకులనైనా ఎదుర్కోగలమని అన్నారు. తైవాన్‌తో ఉన్న వివాదం అంతర్గతమని, తైవాన్ స్వాతంత్ర్యాన్ని వ్యతిరేకిస్తున్నట్టు జిన్‌పింగ్ తెలిపారు. కాగా, చైనా గత కొంతకాలంగా స్థిరాస్తి మార్కెట్ దెబ్బతినడం, ఈవీ వాహనాలు, బ్యాటరీలపై అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్ ఎక్కువ పన్నులు విధించడం, దేశంలో అంతర్గతంగా ఉన్న సమస్యలతో ఇబ్బందులను ఎదుర్కొంటోంది.

Advertisement

Next Story