ఓట్లు, సీట్లు.. బిహార్‌లో తేడా ఎక్కడొచ్చింది?

by Phanindra |

బిహార్‌లో ఆర్జేడీకి ఓట్ల షేరింగ్ ఎక్కువగానే ఉంది. కానీ సీట్లు మాత్రం తగ్గాయి. దీనికి కారణమేంటి? ఆర్జేడీకే ఎక్కువ ఓట్లొచ్చాయా?

ఓట్లు, సీట్లు.. బిహార్‌లో తేడా ఎక్కడొచ్చింది?
X

దిశ, నేషనల్ బ్యూరో: కచ్చితంగా గెలిచేది మేమే.. కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసి చూపిస్తాం.. అంటూ ప్రకటనలు చేసిన ప్రతిపక్షానికి బిహార్‌లో ఘోరపరాజయం తప్పలేదు. అధికార ఎన్డీయే కూటమి డబుల్ సెంచరీతో చెలరేగితే.. విపక్ష కూటమి కనీసం హాఫ్ సెంచరీ కూడా కొట్టలేకపోయింది. సభలకు భారీగా ప్రజలను పుల్ చేయగలిగిన తేజస్వీ యాదవ్.. వారిని ఓటర్లుగా మలిచి, సీట్లు గెలవడంలో తడబడ్డారు. అయితే ఎన్నికల్లో భారీగా సీట్లు గెలిచిన బీజేపీ, జేడీయూతో పోలిస్తే ఆర్జేడీకి పోలైన ఓట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం. అంటే ఓడిపోయినా ప్రజల్లో తమ పాపులారిటీని ఆ పార్టీ నిలబెట్టుకుందనే చెప్పాలి. ఈ ఎన్నికల్లో 25 సీట్లే గెలిచిన ఆర్జేడీ ఏకంగా 23 శాతం ఓట్లు సాధించింది. 2020 ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పుడు ఈ పార్టీ 23.11 శాతం ఓట్ షేర్ సాధించగా.. ఈసారి స్వల్పంగా ఓట్లు తగ్గాయి. 2025లో ఆర్జేడీకి మొత్తం 1.15 కోట్లకుపైగా ఓట్లు దక్కాయి. బీజేపీకి దక్కి కోటి పైగా ఓట్లు (20.08 శాతం ఓట్ షేర్), జేడీయూకు దక్కిన 96.6 లక్షల ఓట్లు (19.25 శాతం) కన్నా ఆర్జేడీ మెరుగైన ప్రదర్శనే చేసింది.

కూటమి భాగస్వాముల పెర్ఫామెన్స్

అయితే ఎన్డీయే కూటమిలోని పార్టీల ఓటు శాతాలు.. 2020 ఎన్నికలతో పోలిస్తే బాగా పెరిగాయి. ఆ ఎలక్షన్స్‌లో బీజేపీ ఓట్ షేర్ 19.46 శాతం కాగా.. జేడీయూది కేవలం 15.39 శాతంగానే ఉంది. ఈసారి ఈ రెండు పార్టీలూ తమ ఓట్ షేర్‌ను పెంచుకోగలిగాయి. ఈ విషయంలో ఆర్జేడీ సక్సెస్ కాలేకపోయింది. అంతేకాదు ఎన్డీయేకు తమ కూటమి భాగస్వాములు కూడా బాగా కలిసొచ్చారు. చిరాగ్ పాశ్వాన్‌కు చెందిన ఎల్జేపీ (రామ్ విలాస్), హిందుస్తానీ ఆవామో మోర్చా (సెక్యులర్), రాష్ట్రీయ లోక్ మోర్చాకు వచ్చిన ఓట్లు కూడా కలుపుకుంటే.. ఎన్డీయే కూటమికి 2025 ఎన్నికల్లో ఏకంగా 46-47 శాతం ఓట్లు దక్కాయి. అదే మహాగఠ్‌బంధన్ కూటమి పార్టీన్నీ కలిపినా కూడా వాటి ఓట్ల శాతం 35.89 శాతంగానే ఉంది. విపక్ష కూటమి ఓటమికి ఇది ప్రధాన సమస్య.

అసలు లెక్కలివీ..

ఈ ఓట్ షేరింగ్ లెక్కలు చూపిస్తున్న పలువురు.. బిహార్‌లో ‘ఓట్ చోరీ’ జరిగిందంటూ విమర్శలు చేస్తున్నారు. మొత్తం 23 శాతం ఓట్లు వచ్చినా.. ఆర్జేడీ కేవలం 25 సీట్లే నెగ్గిందని, అదే 20 శాతం ఓట్లు దక్కిన బీజేపీకి 89 సీట్లు రావడం ఏంటని? ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, 19 శాతం ఓట్లు దక్కిన జేడీయూ కూడా 85 సీట్లు గెలిచిందని వాళ్లు ఎత్తిచూపుతున్నారు. ఎల్జేపీ(ఆర్వీ)కి 4.97 శాతం ఓట్లు దక్కినా 19 సీట్లు గెలిచిందని, అదే 8.71 శాతం ఓట్లు వచ్చిన కాంగ్రెస్ మాత్రం 6 సీట్లే నెగ్గిందని గుర్తుచేస్తున్నారు. అయితే ఇవన్నీ కాకిలెక్కలేనని ఎన్డీయే వర్గాలంటున్నాయి. ఆర్జేడీ ఏకంగా 143 సీట్లలో పోటీ చేసిందని, అదనపు సీట్లలో ఓడినా ఆ పార్టీకి పోలయ్యే ఓట్ల సంఖ్య ఎక్కువగానే ఉంటుందని వివరిస్తున్నాయి. బీజేపీ, జేడీయూ పార్టీలు చెరో 101 సీట్లలోనే పోటీ చేశాయని, వీటి కన్నా 40 సీట్లు అదనంగా పోటీ చేసిన ఆర్జేడీకి 4 శాతం కూడా ఓట్లు ఎక్కువ రాలేదని ఎత్తిచూపుతున్నారు. ఇక ఎల్జేపీ(ఆర్వీ) కేవలం 29 సీట్లలో పోటీ చేస్తే.. కాంగ్రెస్ ఏకంగా 61 సీట్లలో పోటీ చేసిందని గుర్తుచేస్తున్నారు. ఇలా చూసుకుంటే చిరాగ్ పాశవాన్ పార్టీకే ఎక్కువ ఓట్లు పోలైనట్లు అని చెప్తున్నారు. ఈ సీట్ల షేరింగ్ ఫార్ములా కచ్చితంగా ఎన్డీయేకు ఎక్కువ సీట్లు రావడానికి దోహదపడిందని నిపుణులు కూడా నమ్ముతున్నారు.

Next Story