మళ్లీ కోవిడ్ వ్యాప్తి.. ఆ నాలుగు సబ్ వేరియంట్లే కారణమన్న NIV

by Naga Rani Yarlagadda |

ఇటీవలి కాలంలో భారత్‌లో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో.. దీనికి మూలకారణంగా ఒమిక్రాన్‌ వంశానికి చెందిన నాలుగు కొత్త రకాలు ఉన్నట్లు పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV) వెల్లడించింది.

మళ్లీ కోవిడ్ వ్యాప్తి.. ఆ నాలుగు సబ్ వేరియంట్లే కారణమన్న NIV
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవలి కాలంలో భారత్‌లో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో.. దీనికి మూలకారణంగా ఒమిక్రాన్‌ వంశానికి చెందిన నాలుగు కొత్త రకాలు ఉన్నట్లు పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV) వెల్లడించింది. తాజా గణాంకాల ఆధారంగా ఈ వేరియంట్లను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ పద్ధతిలో గుర్తించినట్టు వారు తెలిపారు. ఈ పరిశోధనల ఫలితాలు వ్యాక్సిన్‌లు ఎంతవరకు ప్రభావవంతంగా పనిచేస్తున్నాయన్న విషయాన్ని అంచనా వేసేందుకు ఉపకరిస్తాయని అధికారులు చెబుతున్నారు.

కొన్ని నెలలుగా వ్యాప్తి చెందుతున్న వేరియంట్లు ఇవే

ప్రస్తుతం దేశంలో వ్యాపిస్తున్న కరోనా నమూనాల్లో చేసిన జన్యుపరిశీలనలో.. నాలుగు వేరియంట్లు వెలుగు చూశాయని NIV డైరెక్టర్ డాక్టర్ నవీన్ కుమార్ తెలిపారు. వాటిలో LF.7, XFG, JN.1.16, NB.1.8.1 ప్రధానంగా ఉన్నాయి. తొలుత JN.1.16 వలన కేసుల సంఖ్య పెరిగినప్పటికీ.. మే నెల నుంచి XFG ప్రభావం ఎక్కువగా ఉందని ఆయన వెల్లడించారు. LF.7, LP.81.2 అనే రెండు వేరియంట్లు కలిసే XFG రూపాంతరం ఏర్పడిందని వివరించారు. కొత్త వేరియంట్లను గుర్తించేందుకు జీనోమ్ సీక్వెన్సింగ్‌ను కొనసాగిస్తున్నట్లు కూడా చెప్పారు.

ప్రస్తుత పరిస్థితి – రాష్ట్రాల వారీగా వైరస్ వ్యాప్తి

ఏప్రిల్‌ రెండో వారం నుంచి దేశంలో కోవిడ్‌ కేసులు మళ్లీ నమోదవుతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం.. ప్రస్తుతం 6,483 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. జనవరి 1 నుండి ఇప్పటివరకు 113 మంది మృతిచెందారు.

కేరళలో అత్యధికంగా కేసులు నమోదవుతుండగా గుజరాత్‌, కర్ణాటక, ఢిల్లీలో కూడా వైరస్‌ వ్యాప్తి ఎక్కువగానే ఉంది. అయితే.. ప్రస్తుతం ఉన్న వేరియంట్ల ప్రభావం తక్కువగానే ఉందని, రోగులు ఎక్కువగా ఇంటి వద్దే చికిత్స తీసుకుంటున్నారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

Next Story