Rijiju: ప్రస్తుత సమావేశాల్లోనే వక్ఫ్ బిల్లు ప్రవేశపెడతాం.. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు

by B.Srinivas |

ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశపెడతామని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు.

Rijiju: ప్రస్తుత సమావేశాల్లోనే వక్ఫ్ బిల్లు ప్రవేశపెడతాం.. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే పార్లమెంటులో వక్ఫ్ సవరణ బిల్లు (Waqf amendment bill)ను ప్రవేశపెడతామని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు (KIran rijiju) స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని తెలిపారు. కొన్ని రాజకీయ పార్టీలు, సంస్థలు సమాజంలో అశాంతిని రెచ్చగొట్టడానికి, బిల్లులోని నిబంధనలపై ప్రజలను తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. సోమవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. వారాంతపు సెలవులు, పండుగ సెలవుల తర్వాత ఉభయ సభలు తిరిగి సమావేశమైన వెంటనే సంప్రదింపుల జరిపి బిల్లు ప్రవేశపెట్టే సమయాన్ని నిర్ణయిస్తామని చెప్పారు.

వీలైనంత త్వరగా దానిని ఆమోదించాలని కోరుకుంటున్నామన్నారు. బిల్లులోని నిబంధనలకు సంబంధించిన ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ బిల్లు పేద ముస్లింలు, పిల్లలు, మహిళల ప్రయోజనాల కోసమేనని వెల్లడించారు. వక్ఫ్ బోర్డు పరిధిలోని ఆస్తుల నిర్వహణలో జవాబుదారీతనం, పారదర్శకతను నిర్ధారిస్తుందని తెలిపారు. ఈ బిల్లుపై ఏర్పడిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ ప్రజాస్వామ్య భారతదేశ చరిత్రలో ఇప్పటివరకు జరిగిన అతి పొడవైన సంప్రదింపుల ప్రక్రియగా రికార్డు సృష్టించింద కొనియాడారు. ప్రజలను తప్పుదారి పట్టించొద్దని రాజకీయ పార్టీలను కోరారు.

ఏప్రిల్ 2న ప్రవేశపెట్టే చాన్స్!

వక్ఫ్ సవరణ బిల్లును ఏప్రిల్ 2న పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ప్రస్తుత బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్ 4వ తేదీనే ముగుస్తాయి. దీంతో మంగళవారం ఉభయసభలు ప్రారంభం కాగానే దీనిపై ప్రభుత్వం చర్చలు జరిపి సభలో ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం. లోక్ సభ, రాజ్యసభలో ఆమోదం పొందిన అనంతరం బిల్లు చట్టంగా మారనుంది.

Next Story