RGV: రామ్‌గోపాల్ వర్మకు దెబ్బ మీద దెబ్బ.. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

by Kema Shiva Kumar |   (  Updated:2025-03-07 01:53:53  IST  )

దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ (Ramgopal Varma)కు ముంబై కోర్టు (Mumbai Court)లో చుక్కెదురైంది.

RGV: రామ్‌గోపాల్ వర్మకు దెబ్బ మీద దెబ్బ.. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
X

దిశ, వెబ్‌డెస్క్: దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ (Ramgopal Varma)కు ముంబై కోర్టు (Mumbai Court)లో చుక్కెదురైంది. చెక్కు బౌన్స్‌ కేసులో తనకు విధించిన జైలు శిక్షను రద్దు చేయాలని దాఖలు చేసిన పిటిషన్‌ను సెషన్స్‌ కోర్టు తోసిపుచ్చింది. నాన్ బెయిలబుల్ వారెంట్ (Non-Bailable Warrant) జారీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గత నెల 21న అంధేరీ (Andheri)లోని జ్యుడీషియల్ మేజిస్ట్రేట్‌ (Judicial Magistrate) నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ యాక్ట్‌ (Negotiable Instruments Act) నిబంధనల ప్రకారం రామ్‌గోపాల్‌ వర్మ నేరానికి పాల్పడినట్లుగా తేలుస్తూ.. మూడు నెలల జైలు శిక్ష విధించారు. ఆ మూడు నెలల్లో ఫిర్యాదుదారుడికి వర్మ రూ.3.72 లక్షల పరిహారం చెల్లించాలని, లేదంటే మరో 3 నెలలు సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని మెజిస్ట్రేట్ తీర్పును వెల్లడించారు.

అయితే, ఆ తీర్పును సవాల్‌ చేస్తూ రామ్‌గోపాల్‌ వర్మ (Ramgopal Varma) ముంబై సెషన్స్‌ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అదనపు సెషన్స్‌ జడ్జి ఎ.ఎ.కులకర్ణి ఈ అప్పీల్‌ను తిరస్కరిస్తూ రామ్‌గోపాల్‌ వర్మకు వ్యతిరేకంగా నాన్ బెయిలబుల్ వారెంట్ (Non-Bailable Warrant) జారీ చేశారు. అంధేరీ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్‌ (Andheri Judicial Magistrate) విధించిన జైలు శిక్షను రద్దు చేసేందుకు నిరాకరించారు. కానీ, నిందితుడు రామ్‌గోపాల్‌ వర్మ కోర్టు ఎదుట హాజరై బెయిల్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని జడ్జి తెలిపారు. వారెంట్‌ అమలు కోసం కేసు విచారణను జులై 28కి వాయిదా వేశారు. కాగా, 2018లో మహేష్‌చంద్ర మిశ్రా (Mahesh Chandra Mishra) అనే వ్యక్తి శ్రీ అనే కంపెనీ పేరుతో రామ్‌గోపాల్ వర్మపై చెక్ బౌన్స్ కేసులో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Next Story