West Bengal: ఆర్జీకర్ హత్యాచార ఘటన.. తీర్పు వెలువరించిన కోల్‌కతా కోర్టు

by Shamantha N |   (  Updated:2025-01-18 09:48:32  IST  )

కోల్ కతా ఆర్జీ కర్‌ మెడికల్‌ కాలేజీ పీజీ డాక్టర్ హత్యాచతార కేసులో నిందితుడ్ని కోర్టు దోషిగా తేల్చింది. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ ని దోషిగా తేలుస్తూ సిల్దా కోర్టు తీర్పు వెలువరించింది.

West Bengal: ఆర్జీకర్ హత్యాచార ఘటన.. తీర్పు వెలువరించిన కోల్‌కతా కోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్జీకర్‌ వైద్యవిద్యార్థిని(Kolkata Doctor Murder Case) హత్యాచారం కేసులో కోల్‌కతాలోని సీల్దా కోర్టు తీర్పు వెలువరించింది. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ ని దోషిగా తేలుస్తూ తీర్పు ఇచ్చింది. అయితే, శిక్ష ఏంటనేది మాత్రం వెల్లడించలేదు. సోమవారం నిందితుడికి శిక్ష ఖరారు చేయనున్నట్లు కోర్టు వెల్లడించింది. 160 పేజీల తీర్పులో సీల్దాలోని అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు హత్యాచారానికి కారణమయ్యే భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ల కింద సంజయ్ రాయ్ ని దోషిగా తేల్చింది. "సాక్ష్యాలలో బయటపడిన పోలీసులు, ఆస్పత్రి అధికారుల కొన్ని కార్యకలాపాలను నేను విమర్శించాను. హెచ్ఓడీ, సీనియర్ డాక్టర్లు, ప్రిన్సిపల్ చేసిన పనులు కొంత గందరగోళాన్ని సృష్టించాయి. అవన్నీ చట్టవిరుద్ధం" అని న్యాయమూర్తి అనిర్బన్ దాస్ అన్నారు. తీర్పు తర్వాత బాధితురాలి తండ్రి కోర్టులో విలపిస్తూ.. "నేను మీపై ఉంచిన నమ్మకాన్ని నిలుపుకున్నారు" అని న్యాయమూర్తితో అన్నారు. శనివారం మధ్యాహ్నం గట్టి భద్రత మధ్య జనంతో కిక్కిరిసిపోయిన కోర్టుకి సంజయ్ రాయ్ ని పోలీసులు తీసుకొచ్చారు. తనను కావాలనే ఇరికించారని మరోసారి చెప్పారు. ఈ విషయాలన్నీ పోలీసులకు తెలుసని చెప్పుకొచ్చాడు. నవంబర్‌ 12నుంచి ఈకేసుపై సీల్దా కోర్టులో విచారణ జరుగుతోంది. దాదాపు 50 మంది సాక్ష్యాలను పరిశీలించింది. జనవరి 9న తుది విచారణ పూర్తయింది.

అసలేం జరిగిందంటే?

గతఏడాది ఆగస్టు 9వ తేదీ రాత్రి ఆర్జీ కర్‌ కాలేజ్ అండ్ హాస్పిటల్ సెమినార్‌ రూమ్‌లో ఒంటరిగా నిద్రిస్తున్న జూనియర్‌ డాక్టర్ పై హత్యాచారం (Kolkata Doctor Murder Case) జరిగింది. పశ్చిమ బెంగాల్ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును కోల్‌కతా పోలీసుల నుంచి సీబీఐకి బదిలీ చేశారు. నిందితుడు సంజయ్‌రాయ్‌కు పాలిగ్రాఫ్‌ టెస్ట్‌ నిర్వహించడం సహా ఆర్జీకార్‌ మాజీ ప్రిన్సిపాల్ సందీప్‌ ఘోష్‌తో పాటు పలువుర్ని సీబీఐ ప్రశ్నించింది. ఇక ఈ కేసులో ఆర్జీకర్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్, తాలా పోలీస్‌ స్టేషన్‌ మాజీ ఆఫీసర్‌ ఇన్‌ ఛార్జి అభిజిత్‌ మండల్‌ను అరెస్టు చేసింది. సాక్ష్యాలు తారుమారుచేశారన్న ఆరోపణలపై వారు అరెస్టయ్యారు. ఆతర్వాత బెయిల్ పై విడుదలయ్యారు. కాగా.. ఈ కేసుపై ప్రత్యేక కోర్టుకు సీబీఐ అభియోగాలు సమర్పించింది. ప్రధాన నిందితుడు సంజయ్‌ రాయ్‌ పేరును మాత్రమే ఛార్జిషీట్‌లో చేర్చింది. అయితే, గ్యాంగ్ రేప్ అనే అంశాన్ని మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు. ఆసుపత్రి ఆవరణలోని సీసీటీవీలో నమోదైన దృశ్యాల ఆధారంగా సంజయ్‌ను ఆగస్టు 10న కోల్‌కతా పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Next Story