నాన్నా.. ఇంటికొచ్చెయ్ రా.. ఐఐటీ బాబాకు తండ్రి వేడుకోలు

by Ajay Maddhiboyina |   (  Updated:2025-01-19 10:42:55  IST  )

12వ తరగతి తర్వాత ఢిల్లీలో ఐఐటీ కోచింగ్ తీసుకొని, బాంబే ఐఐటీలో సీటు తెచ్చుకున్నాడని తండ్రి కరణ్ గ్రేవల్ గుర్తు చేసుకున్నారు.

నాన్నా.. ఇంటికొచ్చెయ్ రా.. ఐఐటీ బాబాకు తండ్రి వేడుకోలు
X

- అభయ్ సింగ్ రాక కోసం కుటుంబం ఎదురు చూపు

- కుంభమేళాలో అభయ్‌ను బహిష్కరించిన అఖారా

దిశ, నేషనల్ బ్యూరో:

ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో అందరినీ ఆకర్షించిన ఐఐటీ బాబాను ఇంటికి తిరిగి వచ్చేయాలని తండ్రి వేడుకుంటున్నారు. ఐఐటీ ముంబైలో ఏరో స్పేస్ ఇంజనీరింగ్ చదవి, ఉన్నతోద్యోగాన్ని సైతం వదిలేసి బాబాలా మారిన అభయ్ సింగ్‌ను మీడియా ఐఐటీ బాబాగా సంబోధిస్తోంది. అయిటే మీడియాలో చాలా పాపులర్ అయిన తర్వాత అతని కుటుంబాన్ని కలవగా ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. అభయ్ సింగ్ కోసం హర్యానాలోని ఝాజ్జర్ జిల్లాలో ఉన్న ఆయన కుటుంబం ఇంకా ఎదురు చూస్తూ ఉంది. ఏనాటికైనా అతను తిరిగి ఇంటికి వస్తాడనే ఆశతో ఉన్నారు. ముఖ్యంగా అభయ్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నతండ్రి.. అతడిని తిరిగి ఇంటికి రావాలని బాధాతప్త హృదయంతో వేడుకుంటున్నాడు. తన కుమారుడు ఇంటికి రావాలని కోరుకుంటున్నాను. ఇప్పటికీ అభయ్ చిన్ననాటి విషయాలు నా కళ్ల ముందు కదలాడుతున్నాయి. చిన్నప్పటి నుంచి చదవులో అత్యంత ప్రతిభ కనపరిచేవాడు. 12వ తరగతి తర్వాత ఢిల్లీలో ఐఐటీ కోచింగ్ తీసుకొని, బాంబే ఐఐటీలో సీటు తెచ్చుకున్నాడని తండ్రి కరణ్ గ్రేవల్ గుర్తు చేసుకున్నారు.

ఐఐటీలో చదువు ముగించుకున్న తర్వాత ఢిల్లీ, కెనాడాల్లోని టాప్ కంపెనీల్లో పని చేశాడు. అతను నెలకు రూ.3 లక్షలు సంపాదిస్తున్నా ఎందుకో నిరాశగా కనపడేవాడు. ఉద్యోగం చేసే సమయంలో తీవ్రమైన ఒత్తిడికి గురయ్యాడు. అప్పుడే సెయింట్‌గా మారాలని నిర్ణయించుకున్నాడు. కుటుంబాన్ని వదిలి బాబాగా మారిన తర్వాత ఆరు నెలల క్రితం తనతో అభయ్ మాట్లాడాడని గ్రేవల్ చెప్పారు. అతను ఇంటికి తిరిగి రావాలని మా కుటుంబం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నామని గ్రేవల్ అన్నారు.

అభయ్ సింగ్‌పై బహిష్కరణ వేటు

ఐఐటీ బాబాగా ఫేమస్ అయిన అభయ్ సింగ్‌ను జునా అఖారా క్యాంప్ నుంచి బహిష్కరించినట్లు తెలిసింది. మహా కుంభమేళాలో బాబాల కోసం ఏర్పాటు చేసిన పలు అఖారాల్లో జునా అఖారా ఒకటి. అక్కడే అభయ్ సింగ్ ఇతర బాబాలతో కలిసి ఉంటున్నాడు. అయితే ఇటీవల అభయ్ సింగ్ తన గురువు మహంత్ సోమేశ్వర్ పూరిపై దుర్భాషలాడాడు. దీంతో అతడిని జునా అఖారా నుంచి బహిష్కరించినట్లు తెలిసింది. ప్రస్తుతం అభయ్ సింగ్ తమతో కలిసి ఉండటం లేదని జునా అఖారా సభ్యుడు వివరించారు. అభయ్ సింగ్ తమ పరువు తీస్తున్నాడు. అతను సాధువు కాదు ఒక సంచారి మాత్రమే. కానీ టీవీల్లో అతను ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. అందుకే క్యాంప్ నుంచి వెళ్లగొట్టినట్టు చెప్పారు. కాగా, అఖారా నుంచి తనను బహిష్కరించలేదని అభయ్ సింగ్ చెప్పారు. తనను బహిష్కరించారని వచ్చిన వార్తలన్నీ అవాస్తవాలని పేర్కొన్నాడు.

Next Story