Trump: వలసదారుల కేసులో సుప్రీంకోర్టు తీర్పుపై ట్రంప్ ఆగ్రహం

by Shamantha N |

వలసదారుల కేసులో అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కాగా.. అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) ఖండించారు.

Trump: వలసదారుల కేసులో సుప్రీంకోర్టు తీర్పుపై ట్రంప్ ఆగ్రహం
X

దిశ, నేషనల్ బ్యూరో: వలసదారుల కేసులో అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కాగా.. అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) ఖండించారు. ఈ మేరకు ఆయన ట్రూత్‌ సోషల్‌ వేదికగా ఒక పోస్టు పెట్టారు. ‘మన దేశంలోకి చట్టవిరుద్ధంగా వచ్చిన వారిని బలవంతంగా పంపడాన్ని అనుమతించమని సుప్రీంకోర్టు ఇప్పుడే తీర్పునిచ్చింది. వారిలో అనేకమంది హంతకులు, డ్రగ్ పెడ్లర్స్, నేరస్థులు ఉన్నారు. సుప్రీం తీర్పు నేపథ్యంలో వారిని చట్టబద్ధంగా దేశం నుంచి పంపించేందుకు చాలా సంవత్సరాలు పడుతోంది. ఈలోపు వారు దేశంలో అనేక నేరాలకు పాల్పడతారు. ఇది అమెరికన్లకు హాని కలిగిస్తోంది. కోర్టు తీర్పు మరింతమంది నేరస్థులను మన దేశంలోకి అక్రమంగా ప్రవేశించడానికి ప్రోత్సహిస్తున్నట్లే అవుతోంది. వారు ఇక్కడికి వచ్చి విధ్వంసం సృష్టిస్తారు. గత అధ్యక్షుడు జో బైడెన్‌ లక్షలాది మంది క్రిమినల్స్‌ను అక్రమంగా మన దేశంలోకి రావడానికి అనుమతించారు. వారిని బయటకు పంపిచేందుకు మాత్రం మనం సుదీర్ఘమైన చట్టబద్ధమైన ప్రక్రియను అనుసరించాలి. మన దేశాన్ని రక్షించడానికి ప్రయత్నించిన జస్టిస్‌ అలిటో, జస్టిస్‌ థామస్‌లకు కృతజ్ఞతలు. ఇది అమెరికాకు మరో ప్రమాదకరమైన రోజు’ అని ట్రంప్‌ పేర్కొన్నారు.

ఏలియన్ ఎనిమీస్ యాక్ట్..

ఇకపోతే, 1798 నాటి ఏలియన్‌ ఎనిమీస్‌ యాక్ట్‌ను వినియోగించి అమెరికాలో ఉంటున్న వెనెజులాకు చెందిన గ్యాంగ్‌ను బహిష్కరించాలని ట్రంప్‌ ప్రయత్నించారు. ఈ చర్యలకు అక్కడి కోర్టు తప్పుబట్టింది. అక్రమవలసదారుల బహిష్కరణను చట్టబద్ధంగా సవాలు చేయడానికి వారికి తగినంత సమయం ఇవ్వాలని కోరింది. దీనిపైనే ట్రంప్ స్పందించారు.

Next Story