- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెస్క్యూ ఆపరేషన్: వాటర్ ట్యాంక్‌పై చిక్కుకున్న చిన్నారులు.. రక్షించిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ జిల్లా సిద్ధార్థ్‌నగర్‌లో అర్ధరాత్రి ఉత్కంఠ భరిత సంఘటన చోటుచేసుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ జిల్లా సిద్ధార్థ్‌నగర్‌లో అర్ధరాత్రి ఉత్కంఠ భరిత సంఘటన చోటుచేసుకుంది. ఓ భారీ వాటర్ ట్యాంక్ పై చిక్కుకుపోయిన ఇద్దరు చిన్నారులను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) అధికారులు హెలికాప్టర్ సాయంతో సాహసోపేతంగా రక్షించారు. అసలేం జరిగిందంటే.. సిద్ధార్థ్‌నగర్‌లోని ఓ వాటర్ ట్యాంక్ పైకి ఇద్దరు చిన్నారులు ఎక్కారు. అయితే, కిందకు దిగేందుకు ఉన్న ఇనుప నిచ్చెన (Ladder) పూర్తిగా దెబ్బతినడంతో మార్గం లేక వారు పైనే చిక్కుకుపోయారు. రాత్రి సమయం కావడంతో గంటల తరబడి అక్కడే భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు, అధికారులు వారిని సురక్షితంగా కిందకు దించేందుకు ప్రయత్నించారు.
రంగంలోకి దిగిన వైమానిక దళం..
పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.. తక్షణమే భారత వైమానిక దళం సహాయాన్ని కోరింది. రాష్ట్ర ప్రభుత్వ అత్యవసర అభ్యర్థన మేరకు సెంట్రల్ ఎయిర్ కమాండ్ (CAC) కి చెందిన ‘Mi-17 V5’ హెలికాప్టర్‌ను ఐఏఎఫ్ వెంటనే రంగంలోకి దించింది. గోరఖ్‌పూర్ బేస్ నుంచి ఘటన స్థలానికి చేరుకున్న వాయుసేన సిబ్బంది.. ఎంతో నైపుణ్యంతో ఇద్దరు చిన్నారులను ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా ఎయిర్‌లిఫ్ట్ చేశారు. విపత్కర పరిస్థితుల్లో రక్షణ దళాలు, రాష్ట్ర యంత్రాంగం మధ్య ఉన్న సమన్వయానికి ఈ ఆపరేషన్ ఒక అద్భుత నిదర్శనమని అధికారులు పేర్కొన్నారు. సురక్షితంగా రక్షించబడిన చిన్నారులను అనంతరం వారి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు అధికారులు స్పష్టం చేశారు.
సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు..
ప్రాణాలను కాపాడేందుకు ఐఏఎఫ్ సిబ్బంది చూపించిన తెగువ, వృత్తి నైపుణ్యాలపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. సెంట్రల్ ఎయిర్ కమాండ్ చేసిన ఎక్స్ (X) పోస్ట్‌పై నెటిజన్లు స్పందిస్తున్నారు. ‘ఐఏఎఫ్ చేసిన పని అద్భుతం (Great job by IAF)’, ‘మీ సేవలకు ధన్యవాదాలు’ అంటూ వాయుసేనను కొనియాడుతున్నారు. మరోవైపు, ఒక నెటిజన్ స్పందిస్తూ.. ‘కానీ అసలు ఆ బాలురు వాటర్ ట్యాంక్ పై ఏం చేస్తున్నారు?’ అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఏది ఏమైనప్పటికీ, ఆపద సమయంలో తక్షణమే స్పందించి ప్రాణాలను రక్షించడంలో భారత వాయుసేనకు ఉన్న అంకిత భావాన్ని ఈ రెస్క్యూ ఆపరేషన్ మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది.






