రేపే 75 ఏళ్ల గణతంత్ర సంబరాలు

by Ajay Maddhiboyina |   (  Updated:2025-01-24 18:01:11  IST  )

రేపే 75 ఏళ్ల గణతంత్ర సంబరాలు
X

- జాతీయ జెండా ఆవిష్కరించనున్నరాష్ట్రపతి ముర్ము

- ముఖ్య అతిథిగా ఇండోనేషియా ప్రెసిడెంట్

- కర్తవ్యపథ్‌లో అంగరంగ వైభవంగా వేడుకలు

- భారీ భద్రతా ఏర్పాట్లు చేసిన ఢిల్లీ పోలీసులు

దిశ, నేషనల్ బ్యూరో:

భారత 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఢిల్లీలోని కర్తవ్యపథ్ అందంగా ముస్తాబైంది. రాజ్యాంగం అమలులోకి వచ్చిన 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సారి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రిపబ్లిక్ డే నాడు కర్తవ్యపథ్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఈ సారి గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇండోయేషియా ప్రెసిడెంట్ ప్రబోవో సుబియాంతో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ సారి గణతంత్ర వేడుకల్లో ప్రజల భాగస్వామ్యం కూడా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లు పూర్తి కావడంతో రిపబ్లిక్ డే ముందు, ఆ తర్వాత పలు కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది.

పరేడ్‌లో ఇలా..

రిపబ్లిక్ డే పరేడ్‌లో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలకు చెందిన 31 శకటాలు పాల్గొంటాయి. స్వర్ణ భారత్ - వారసత్వం, అభివృద్ధి అనే థీమ్‌తో ఈ సారి శకటాలు పరేడ్‌లో ప్రదర్శన ఇవ్వనున్నాయి. ఇందులో రెండు శకటాలు 75 ఏళ్ల రాజ్యాంగాన్ని గుర్తు చేసుకుంటూ రూపొందించారు. పరేడ్‌లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన 47 విమానాలు స్కైపాస్ట్ చేయనున్నాయి. దేశంలోని నలుమూలల నుంచి వచ్చిన కళాకారులు సాంప్రదాయ వాయిద్యాలతో ప్రదర్శన చేయనున్నారు. రిపబ్లిక్ వేడుకలకు 10 వేల మంది ప్రత్యేక అతిథులను ఆహ్వానించారు. ఇందులో వివిధ రంగాల్లో విజయాలు సాధించిన వారితో పాటు సర్పంచ్‌లుకూడా ఉన్నారు. ప్రతీ రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతం నుంచి వారి సాంప్రదాయ దుస్తులు ధరించిన ఒక్కో పరేడ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ఇక రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఆన్‌లైన్ కాంపిటీషన్, వ్యాస రచన, పెయింటింగ్, శకటాల డిజైన్లలో గెలిచిన వారు కూడా పరేడ్‌లో పాల్గొంటారు. ఈ సందర్భంగా 5 వేల మంది కళాకారులతో 45 రకాల నృత్యరీతులను ప్రదర్శించనున్నారు. ది నేషనల్ స్కూల్ ఆఫ్ బ్యాండ్ కాంపిటీషన్‌లో పాల్గొన్న ఫైనలిస్టులు కర్తవ్యపథ్‌లో ప్రదర్శన ఇవ్వనున్నారు.

తెలంగాణ శకటం మిస్..

గణతంత్ర వేడుకల పరేడ్‌లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన శకటం ఈ సారి పాల్గొనడం లేదు. ఈ సారి కేవలం 15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన శకటాలు మాత్రమే ఎంపిక అయ్యాయి. ఆంధ్రప్రదేశ్చ, బీహార్, గోవా, గుజరాత్, జార్ఖండ్, కర్నాటక, మధ్యప్రదేశ్, పంజాబ్, త్రిపుర, ఉత్తరాఖండ్, ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, చండీఘర్, దాదర్ నగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూకు చెందిన శకటాలు కర్తవ్య పథ్‌ ప్రదర్శనలో పాల్గొంటాయి. వీటితో పాటు 15 కేంద్ర మంత్రిత్వ శాఖలకు చెందిన శకటాలు కూడా పాలుపంచుకోనున్నాయి. రిపబ్లిక్‌డే పరేడ్ కోసం ఎంపిక కాని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తమ మోడల్స్‌ను రెడ్‌ఫోర్ట్‌లో నిర్వహించే భారత్ పర్వ్ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శిస్తారు.

ముగింపు వేడుకలు ఎప్పుడు?

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వద్ద ఈ నెల 26 నుంచి 31 వరకు భారత్ పర్వ్ ఫెస్టివెల్ నిర్వహిస్తున్నారు. ఇందులో వివిధ రాష్ట్రాల ఆహార పదార్థాలు, చేతి వృత్తి కళలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శిస్తారు. ఇక జనవరి 29న బీటింగ్ రిట్రీట్ సెర్మనీ ఉంటుంది. అందులో దేశభక్తి, ఐక్యత థీమ్‌గా భారతీయ సంగీతంతో కూడిన ప్రదర్శనలు ఉంటాయి.

కట్టుదిట్టమైన భద్రత నడుమ ఢిల్లీ

గణతంత్ర దినోత్సవం సందర్భంగా 70 కంపెనీలకు చెందిన పారా మిలటరీ దళాలు, 15 వేల మంది పోలీసులను ఢిల్లీలో మోహరించినట్లు అధికారులు తెలిపారు. రిపబ్లిక్ డే రోజు ఢిల్లీ మొత్తం సీసీ కెమేరాలు, డ్రోన్లు,. సైబర్ స్పెషలిస్ట్ అధికారుల పర్యవేక్షణలో ఉండనుంది. ఇప్పటికే బహుల అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఆరు అంచెల్లో సెక్యూరిటీ చెకింగ్ చేసిన తర్వాతే అతిథులు, సామాన్య ప్రజలను కర్తవ్య పథ్‌లోనికి అనుమతించనున్నారు. పూర్తిగా బారికేడ్లతో భద్రతను కట్టుదిట్టం చేశారు. న్యూ ఢిల్లీ జిల్లా అంతటా వేలాది సీసీ టీవీ కెమేరాలు అమర్చారు. వీటిలో ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ఉన్న కెమేరాలు కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

Next Story