Bashir Badr : ప్రముఖ ఉర్దూ కవి బషీర్ బద్ర్ కన్నుమూత

by Ramesh Naini |

సాహిత్య ప్రపంచంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆధునిక గజల్ రారాజు, ప్రముఖ ఉర్దూ కవి, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ బషీర్ బద్ర్ (91) గురువారం కన్నుమూశారు.

Bashir Badr : ప్రముఖ ఉర్దూ కవి బషీర్ బద్ర్ కన్నుమూత
X

దిశ, డైనమిక్ బ్యూరో: సాహిత్య ప్రపంచంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆధునిక గజల్ రారాజు, ప్రముఖ ఉర్దూ కవి, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ బషీర్ బద్ర్ (91) గురువారం కన్నుమూశారు. సుదీర్ఘ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన భోపాల్‌లోని తన నివాసంలో చివరి శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు నుస్రత్ బద్ర్, భార్య రాహత్ బద్ర్ ధృవీకరించారు.

ఏడేళ్ల వయసులోనే ప్రస్థానం..

1935, ఫిబ్రవరి 15న ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో జన్మించిన బషీర్ బద్ర్.. కేవలం ఏడేళ్ల వయసులోనే కవిత్వం రాయడం ప్రారంభించారు. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (AMU) నుంచి డాక్టరేట్ పొంది, అక్కడే ఉర్దూ ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఆ తర్వాత మీరట్ కాలేజీలో 17 ఏళ్ల పాటు ఉర్దూ విభాగాధిపతిగా సేవలు అందించారు. ఆయన పీజీ పూర్తి కాకముందే ఆయన రాసిన ప్రారంభ కవితలను అలీగఢ్ యూనివర్సిటీ సిలబస్‌లో చేర్చడం విశేషం.

గజల్ సాహిత్యానికి కొత్త అందాలు

ఆధునిక ఉర్దూ సాహిత్యానికి బషీర్ బద్ర్ చేసిన సేవలు అనన్యం. సాధారణ ప్రజలకు సైతం సులభంగా అర్థమయ్యే సమకాలీన ఉర్దూ భాషలో ఆయన రాసిన గజల్స్ లక్షలాది మంది హృదయాలను గెలుచుకున్నాయి. దాదాపు 10,000 ఉర్దూ కవితలు రాసిన ఆయన.. గజల్స్‌కు సంబంధించి 7కు పైగా సంకలనాలను ప్రచురించారు. 1972 భారత్-పాక్ ‘సిమ్లా ఒప్పందం’ సమయంలో ఆయన రాసిన గజల్ పంక్తులు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. ‘దుష్మనీ జమ్ కర్ కరో లేకిన్ యే గుంజాయిష్ రహే, జబ్ కభీ హమ్ దోస్త్ హో జాయేం తో షర్మిందా నా హోం’ (శతృత్వాన్ని గట్టిగానే చేద్దాం.. కానీ రేపటి రోజున మళ్లీ స్నేహితులమైతే తలదించుకునే పరిస్థితి రాకూడదు) అనే ఆయన పంక్తులు ఆలోచింపజేశాయి. సాహిత్య రంగానికి ఆయన చేసిన కృషికి గానూ భారత ప్రభుత్వం 1989లో దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘పద్మశ్రీ’తో సత్కరించింది. అదే ఏడాది ఆయన రాసిన ‘ఆస్’ (Aas) కవితా సంకలనానికి ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.

కాగా, 1987లో మీరట్ ఘర్షణల్లో ఆయన ఇల్లు తగలబడింది. ఆయన జీవితకాల శ్రమ అయిన ఎన్నో అముద్రిత కవితలు, పత్రాలు అందులో బూడిదయ్యాయి. ఈ తీవ్ర నష్టం తర్వాత ఆయన భోపాల్‌కు వలస వెళ్లి, జీరో నుంచి మళ్లీ తన జీవితాన్ని, సాహిత్య ప్రస్థానాన్ని ప్రారంభించారు. బషీర్ బద్ర్ మృతి పట్ల సాహిత్య లోకం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ప్రముఖ గీత రచయితలు, సాహిత్య అభిమానులు అశ్రునివాళులర్పించారు.

Next Story