పాత మిత్రుడి కోసం ఇండియా కూటమి ప్రయత్నాలు!.. ఆ ఆటలు సాగవని తేల్చిన DMK

by Prasad Jukanti |

తమిళనాడులో 'ఇండియా' కూటమికి డీఎంకే చెక్ పెట్టింది. సీఎం విజయ్ పార్టీతో కలిసి నడిచే కేరళ, బెంగాల్ తరహా వ్యూహాన్ని స్టాలిన్ తిరస్కరించినట్లు ప్రచారం జరుగుతోంది.

పాత మిత్రుడి కోసం ఇండియా కూటమి ప్రయత్నాలు!.. ఆ ఆటలు సాగవని తేల్చిన DMK
X

దిశ, డైనమిక్ బ్యూరో: జాతీయ రాజకీయాలు క్రమంగా వేడెక్కుతున్నాయి. రాబోయే సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా అధికార ఎన్డీయే, ప్రతిపక్ష ఇండియా కూటమి ఇప్పటి నుంచే అస్త్రశస్త్రాలకు పదును పెడుతున్నాయి. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న మిత్రపక్షాలను తన వైపు తిరిగి రప్పించుకునే ప్రయత్నాలను ఇండియా కూటమి ముమ్మరం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గత నెలలో ఢిల్లీ వేదికగా సమావేశం అయిన ఇండియా కూటమి ఇకపై ప్రతి రెండు నెలకు ఓ సారి సమావేశం కావాలని నిర్ణయించింది. ఆగస్టులో హైదరాబాద్ వేదికగా ఇండియా కూటమి సమావేశం కాబోతోంది. అయితే ఈ సమావేశానికంటే ముందే కూటమికి దూరమైన తమ మిత్రపక్షాలను తిరిగి తమ వైపు ఆకర్షించేలా కూటమి పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.

తమిళనాడులో ప్రయత్నాలు:

ఇటీవల జరిగిన పరిణామాలతో ఇండియా కూటమికి తమిళనాడులో భారీ ఎదురుదెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్‍తో చేతులు కలపడం పట్ల తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయిన డీఎంకే ఇండియా కూటమికి గుడ్ బై చెప్పింది. అయితే రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీని, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే (DMK) పార్టీని ఒకే వేదికపైకి తేవాలనే ప్రయత్నాలను తాజాగా డీఎంకే రిజెక్ట్ చేసింది. బీజేపీని ఎదుర్కొనేందుకు ఇరు పార్టీలు జాతీయ స్థాయిలో కలిసి పనిచేయాలంటూ గత మిత్రపక్షం వీసీకే (VCK) చేసిన సూచనను డీఎంకే తోసిపుచ్చింది.

కేరళ, బెంగాల్ తరహా వ్యూహం ఇక్కడ పనిచేయదు:

కేరళ, పశ్చిమ బెంగాల్‍లో స్థానికంగా కాంగ్రెస్ సీపీఎం, టీఎంసీతో విభేదిస్తూ జాతీయ స్థాయిలో మాత్రం ఇండియా కూటమిలో కొనసాగుతున్నాయి. గతనెలలో జరిగిన ఇండియా కూటమి సమావేశానికి మమతా బెనర్జీ హాజరుకావడం ఆసక్తిని రేపింది. అయితే ఇదే తరహాలో రాష్ట్రంలో విభేదించినా జాతీయ స్థాయిలో కలిసి పని చేద్దామనే పిలుపు డీఎంకేకు ఇండియా కూటమి నుంచి అందింది. దీంతో ఇటీవలి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ తమకు ద్రోహం చేసిందని ఇలాంటి పరిస్థితుల్లో కేరళ, పశ్చిమ బెంగాల్ తరహా మోడల్ తమిళనాడులో సాధ్యం కాదని డీఎంకే స్పష్టం చేసింది. వీసీకే అధినేత తిరుమావళవన్ కేరళ, పశ్చిమ బెంగాల్‌లలో ఉన్న రాజకీయ వ్యూహాన్ని తమిళనాడులోనూ అమలు చేయాలని ప్రతిపాదించారు. అంటే.. రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యర్థులుగా ఉన్న పార్టీలు, జాతీయ స్థాయిలో మాత్రం బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమిలో భాగస్వాములుగా కొనసాగాలన్నది ఆయన ప్రతిపాదన. ఈ ప్రతిపాదనకు కాంగ్రెస్ కూడా మద్దతు పలికింది. అయితే డీఎంకే దీనిని తీవ్రంగా ఖండించింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేవలం మంత్రి పదవుల కోసమే కాంగ్రెస్ పార్టీ టీవీకే (TVK)తో చేతులు కలిపి డీఎంకేకు వెన్నుపోటు పొడిచిందని తాజాగా డీఎంకే ఎంపీ గణపతి పి.రాజ్‌కుమార్ రియాక్ట్ అయ్యారు. జాతీయ ప్రయోజనాలను పక్కనబెట్టి స్వార్థ రాజకీయాలకు పాల్పడిన కాంగ్రెస్, ఇప్పుడు వీసీకేను రాయబారిగా వాడుతూ డీఎంకేను ఒప్పించాలని చూస్తోంది. మా నాయకత్వం ఈ ప్రతిపాదనను ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించదు. అసలు పార్లమెంట్‌లో ఒక్క ఎంపీ కూడా లేని టీవీకేను ఇండియా కూటమిలో ఎలా భాగం చేస్తారని ఆయన ప్రశ్నించారు.

ఎన్నికల తర్వాత మారిన సమీకరణాలు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే అధికారాన్ని కోల్పోయిన తర్వాత రాష్ట్రంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. తొమ్మిదేళ్ల మిత్రబంధాన్ని తెంచుకున్న కాంగ్రెస్.. మెజారిటీ మార్కుకు దూరంగా నిలిచిన విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) మైనారిటీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి ప్రభుత్వంలో చేరింది. వీసీకే, ఐయూఎంఎల్ పార్టీలు కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం కాగా, కమ్యూనిస్ట్ పార్టీలు (సీపీఐ, సీపీఎం) బయటి నుండి మద్దతు ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ఎంపీ జోతిమణి మాట్లాడుతూ.. దేశ భవిష్యత్తు కోసం, ప్రజాస్వామ్య పునాదులను కాపాడుకునేందుకు బిజెపి వ్యతిరేక శక్తులన్నీ ఒక్కటి కావాల్సిన అవసరం ఉందని సమర్థించుకొచ్చారు.

Next Story