- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సామాన్యులకు ఊరట: దేశంలో ఇంధన ధరలు పెరగవని స్పష్టం చేసిన కేంద్రం
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు భగ్గుమంటున్నా, దేశీయంగా సామాన్యులపై ఆ భారం పడకుండా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు భగ్గుమంటున్నా, దేశీయంగా సామాన్యులపై ఆ భారం పడకుండా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. పెట్రోల్, డీజిల్ ధరలను ఇప్పట్లో పెంచేది లేదని స్పష్టం చేసింది. అంతర్జాతీయంగా రేట్లు పెరిగినప్పటికీ, ఆ నష్టాలను లేదా భారాన్ని చమురు మార్కెటింగ్ సంస్థలే (OMCs) భరించాలని ప్రభుత్వం ఆదేశించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రభుత్వ తాజా నిర్ణయంతో వాహనదారులకు భారీ ఊరట లభించినట్లయింది.
భగ్గుమన్న ముడి చమురు.. 100 డాలర్లు క్రాస్
మిడిల్ ఈస్ట్‌లో (మధ్యప్రాచ్యం) రోజురోజుకూ పెరుగుతున్న ఉద్రిక్తతలు, ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన 'హార్ముజ్ జలసంధి' గుండా సరఫరాలో అంతరాయం ఏర్పడవచ్చన్న ఆందోళనల నేపథ్యంలో.. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు ఒక్కసారిగా పైకి ఎగబాకాయి. 2022 తర్వాత తొలిసారిగా బ్యారెల్ ముడి చమురు ధర 100 డాలర్ల మార్క్‌ను దాటింది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) క్రూడ్ ఏకంగా 17.4 శాతం పెరిగి బ్యారెల్‌కు 106.8 డాలర్లకు చేరింది. బ్రెంట్ క్రూడ్ 15.65 శాతం లాభపడి బ్యారెల్‌కు 107.2 డాలర్లకు చేరుకుంది.
కంపెనీలదే భారం..
సాధారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల హెచ్చుతగ్గులకు అనుగుణంగా దేశంలో ఇంధన ధరల సవరణ జరుగుతుంది. అయితే, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో చమురు సంస్థలు లాభాలు తగ్గించుకుని ఆ భారాన్ని సర్దుబాటు చేసుకోవాలని ప్రభుత్వం సూచించినట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతానికి పెట్రోల్ బంకుల్లో ధరలు పెరిగే అవకాశం లేదు. అయితే ముడి చమురు 100 డాలర్లకు పైగా ట్రేడ్ అవుతుండటంతో, రిటైల్ ధరలను పెంచకపోతే చమురు సంస్థల మార్జిన్లపై తీవ్ర ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం దేశీయంగా ఇంధన ధరలు మాత్రం స్థిరంగానే కొనసాగుతున్నాయి. ముంబైలో సోమవారం లీటర్ పెట్రోల్ ధర రూ.103.49 వద్ద, డీజిల్ ధర రూ.90.01 వద్ద ఎలాంటి మార్పు లేకుండా యథాతథంగా నమోదయ్యాయి. సామాన్యులపై ద్రవ్యోల్బణ భారం పడకూడదనే ఉద్దేశంతోనే కేంద్రం చమురు సంస్థలకు ఈ కీలక ఆదేశాలు జారీ చేసినట్లు మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.






