ఇండిగో ప్రయాణికులకు ఊరట.. డిసెంబర్ 10 నాటికి సేవలు స్థిరీకరణ

by Malleboina Mahesh |

దేశీయ విమానయాన సంస్థ ఇండిగో (IndiGo)లో తలెత్తిన సంక్షోభం ఆరో రోజుకు చేరింది. సిబ్బంది కొరతతో పాటు ఇతర నిర్వహణ సమస్యల కారణంగా ఇండిగో విమాన సర్వీసులు దేశవ్యాప్తంగా అస్తవ్యస్తంగా మారాయి.

ఇండిగో ప్రయాణికులకు ఊరట.. డిసెంబర్ 10 నాటికి సేవలు స్థిరీకరణ
X

దిశ, వెబ్ డెస్క్: దేశీయ విమానయాన సంస్థ ఇండిగో (IndiGo)లో తలెత్తిన సంక్షోభం ఆరో రోజుకు చేరింది. సిబ్బంది కొరతతో పాటు ఇతర నిర్వహణ సమస్యల కారణంగా ఇండిగో విమాన సర్వీసులు దేశవ్యాప్తంగా అస్తవ్యస్తంగా మారాయి. దేశంలోని అన్ని ప్రధాన పట్టణాల్లోని విమానాశ్రయాల్లో ఇండిగో విమానాల రద్దు కొనసాగుతుండటంతో, వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇండిగో చేసిన ప్రకటన ప్రయాణికులకు ఊరట కలిగించింది. ఆరు రోజులుగా కొనసాగుతున్న విమానాల రద్దు, ఆలస్యాల సంక్షోభంపై సంస్థ స్పందిస్తూ.. తమ ఆపరేషన్లను డిసెంబర్ 10 నాటికి స్థిరీకరించాలని (stabilise the operations) లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించింది. గతంలో డిసెంబర్ 10-15 మధ్య సేవలు పూర్తిగా మెరుగుపడతాయని తెలిసినప్పటికీ, ప్రస్తుతం ఈ లక్ష్యాన్ని డిసెంబర్ 10 కి కుదించారు.

ఈ ఒక్కరోజే.. 650 విమానాలు రద్దు

ఇండిగో సంక్షోభం ఆరో రోజుకు చేరిన నేపథ్యంలో.. నేడు 650 విమానాలను రద్దు చేసినట్లు ఇండిగో ప్రకటించింది. అయితే, మొత్తం 2,300 రోజువారీ విమానాల్లో నేడు 1,650 విమానాలను నడపడానికి సిద్ధంగా ఉన్నామని సంస్థ తెలిపింది. శుక్రవారం దాదాపు 1,600 విమానాలు రద్దు చేసిన నేపథ్యంలో శనివారం 1,500 విమానాలు నడిపినట్లు సంస్థ పేర్కొంది. శంషాబాద్‌ (హైదరాబాద్), ఢిల్లీ, ముంబై సహా అన్ని ప్రధాన విమానాశ్రయాల్లో రద్దు కొనసాగుతుండటంతో, ప్రయాణికులు తమ ప్రయాణానికి ముందు విమాన స్థితిని (Flight Status) తెలుసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Next Story