- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెళ్లి నిరాకరణ అత్యాచారం కాదు.. ఉత్తరాఖండ్ హైకోర్టు ఆసక్తికర తీర్పు
పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడనే ఆరోపణలపై ఉత్తరాఖండ్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఇద్దరు మేజర్లు పరస్పర అంగీకారంతో సుదీర్ఘకాలం సహజీవనం చేసిన తర్వాత, పురుషుడు వివాహానికి నిరాకరించినంత మాత్రాన దానిని అత్యాచారంగా పరిగణించలేమని స్పష్టం చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: పరస్పర అంగీకారంతో సహజీవనం చేసిన తర్వాత, పురుషుడు వివాహానికి అంగీకరించలేదనే కారణంతో దానిని అత్యాచారంగా పరిగణించలేమని ఉత్తరాఖండ్ హైకోర్టు (Uttarakhand High Court) సంచలన తీర్పునిచ్చింది. ఇద్దరు మేజర్లు ఇష్టపూర్వకంగా సంబంధంలో ఉన్నప్పుడు, పెళ్లి చేసుకోలేదన్న ఏకైక కారణంతో అది నేరం కిందకు రాదని కోర్టు స్పష్టం చేసింది. వివరాల్లోకి వెళితే.. ముస్సోరీకి చెందిన ఓ మహిళ, ఒక వ్యక్తి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని, ఆ నెపంతో తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.
అయితే, ఈ కేసును విచారించిన న్యాయస్థానం, నిందితుడిపై ఉన్న ఎఫ్.ఐ.ఆర్ (FIR)ను కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది. బాధితురాలు, నిందితుడు ఇద్దరూ మేజర్లని, వారి మధ్య సంబంధం సుదీర్ఘకాలం పాటు పరస్పర అంగీకారంతోనే కొనసాగిందని న్యాయస్థానం గుర్తించింది. సహజీవనం ప్రారంభమైనప్పటి నుంచే సదరు వ్యక్తికి సదరు మహిళను మోసం చేయాలనే దురుద్దేశం ఉన్నట్లు నిరూపించడానికి తగిన ఆధారాలు లేవని ధర్మాసనం అభిప్రాయపడింది. పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేసి, ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆ మాట నిలబెట్టుకోలేకపోవడాన్ని (Breach of Promise) నేరుగా అత్యాచారంగా పరిగణించలేమని కోర్టు తేల్చిచెప్పింది. అదేవిధంగా చాలాకాలం పాటు సహజీవనంలో ఉన్నప్పుడు, శారీరక సంబంధం అనేది కేవలం పెళ్లి వాగ్దానం మీద మాత్రమే ఆధారపడి ఉంటుందని భావించలేమని ధర్మాసనం కామెంట్ చేసింది. అది ఇద్దరి ఇష్టపూర్వక నిర్ణయం కూడా అయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడింది.
కాగా, బాధితురాలు తన ఫిర్యాదులో నిందితుడు మొదటి నుంచి తనను వంచించాలనే ఉద్దేశంతో ఉన్నాడనే విషయాన్ని బలంగా నిరూపించలేకపోయింది. దీంతో సదరు వ్యక్తిపై ఉన్న క్రిమినల్ చర్యలను రద్దు చేస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. చట్టం దుర్వినియోగం కాకుండా ఉండేందుకు ఇలాంటి అంశాల్లో స్పష్టత అవసరమని ఉత్తరాఖండ్ హైకోర్టు స్పష్టం చేసింది.






