రీల్స్ మోజు : చేతిలో నాటు తుపాకీతో బైక్ స్టంట్స్.. ట్రక్కును ఢీకొట్టి ముగ్గురు సోదరుల దుర్మరణం

by Ramesh Naini |   (  Updated:2026-04-19 13:11:27  IST  )

రీల్స్ మోజులో పడి విపరీతమైన వేగంతో బైక్‌పై విన్యాసాలు చేస్తూ ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన మధ్యప్రదేశ్‌లోని మౌగంజ్ జిల్లాలో చోటుచేసుకుంది.

రీల్స్ మోజు : చేతిలో నాటు తుపాకీతో బైక్ స్టంట్స్.. ట్రక్కును ఢీకొట్టి ముగ్గురు సోదరుల దుర్మరణం
X

దిశ, డైనమిక్ బ్యూరో: సోషల్ మీడియాలో లైక్‌లు, వ్యూస్ కోసం నేటి యువత ప్రాణాలను పణంగా పెడుతోంది. రీల్స్ మోజులో పడి విపరీతమైన వేగంతో బైక్‌పై విన్యాసాలు (స్టంట్స్) చేస్తూ ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన మధ్యప్రదేశ్‌లోని మౌగంజ్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ భయానక ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏప్రిల్ 14న జాతీయ రహదారి-135 (NH-135) పై పన్నీ పఠారియా సమీపంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. మొత్తం ఐదుగురు యువకులు రెండు బైక్‌లపై ప్రయాణిస్తున్నారు. ఒక పల్సర్ బైక్‌పై ముగ్గురు యువకులు అతివేగంగా వెళ్తుండగా, వారి వెనుక మరో బైక్‌పై వస్తున్న ఇద్దరు స్నేహితులు ఆ స్టంట్స్‌ను తమ మొబైల్‌లో వీడియో తీస్తున్నారు.

కళ్లముందే కబళించిన మృత్యువు

సినిమాను తలపించేలా డ్రమాటిక్ వీడియో రికార్డ్ చేయాలన్న ఉత్సాహంలో, మొదటి బైక్‌ను నడుపుతున్న యువకుడు వేగాన్ని అమాంతం పెంచేశాడు. అదే సమయంలో బైక్ వెనుక కూర్చున్న ఒక యువకుడు చేతిలో నాటు తుపాకీ (కంట్రీ మేడ్ పిస్టల్) పట్టుకుని గాల్లోకి ప్రదర్శిస్తూ హల్‌చల్ చేశాడు. ఈ క్రమంలో హైవేపై వెళ్తున్న భారీ ట్రైలర్‌లను ఓవర్‌టేక్ చేయబోయి వారి బైక్ అదుపు తప్పింది. వేగం విపరీతంగా ఉండటంతో అదుపు చేయలేక నేరుగా వెళ్లి ముందు ఆగి ఉన్న ట్రక్కును బలంగా ఢీకొట్టారు.

అక్కడికక్కడే ముగ్గురి మృతి

ఈ ప్రమాదంలో పల్సర్ బైక్‌పై ఉన్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. వీడియో తీస్తూ వెనుక వస్తున్న మరో బైక్ కూడా అదుపుతప్పి కింద పడటంతో ఆ ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను బేలా గ్రామానికి చెందిన ఉపలక్ష్ కోల్ (17), అమ్రీష్ కోల్ (22), హేమరాజ్ కోల్ (17) అనే ముగ్గురు సోదరులుగా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అక్కడ పడి ఉన్న నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అతివేగం, అజాగ్రత్త, ప్రాణాలను పణంగా పెట్టి స్టంట్స్ చేయడమే ఈ ఘోర ప్రమాదానికి ప్రాథమిక కారణమని అధికారులు స్పష్టం చేశారు.

ఇటలీలో కాల్పుల కలకలం.. ఇద్దరు భారతీయులు మృతి

Next Story