విదేశాల్లో రీల్స్.. మోడీ ‘మెలోడీ’ చాక్లెట్లపై రాహుల్ గాంధీ సెటైర్లు

by Ramesh Naini |

దేశంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం ముంచుకొస్తున్నా ప్రధాని నరేంద్ర మోడీ విదేశాల్లో రీల్స్ చేస్తూ కాలక్షేపం చేస్తున్నారంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

విదేశాల్లో రీల్స్.. మోడీ ‘మెలోడీ’ చాక్లెట్లపై రాహుల్ గాంధీ సెటైర్లు
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం ముంచుకొస్తున్నా ప్రధాని నరేంద్ర మోడీ విదేశాల్లో రీల్స్ చేస్తూ కాలక్షేపం చేస్తున్నారంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రధాని మోడీ ఇటలీ పర్యటనను ఉద్దేశించి బుధవారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఘాటుగా స్పందించారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనికి పీఎం మోడీ ‘మెలోడీ’ చాక్లెట్ ప్యాకెట్‌ను గిఫ్ట్‌గా ఇవ్వడం, దానికి సంబంధించిన వీడియోను మెలోని సోషల్ మీడియాలో పంచుకోవడంపై రాహుల్ గాంధీ మండిపడ్డారు. తన నియోజకవర్గమైన రాయ్‌బరేలీ పర్యటనలో ఉన్న రాహుల్.. ఈ వ్యవహారంపై ఒక పోస్ట్ చేశారు.

ఇటలీలో చాక్లెట్లు పంచుతూ బిజీ

‘దేశంలో ఆర్థిక తుఫాన్ ముంచుకొస్తోంది.. కానీ మన ప్రధానమంత్రి మాత్రం ఇటలీలో చాక్లెట్లు పంచుతూ బిజీగా ఉన్నారు.. ఇక్కడ రైతులు, యువత, మహిళలు, కార్మికులు, చిన్న వ్యాపారులు కన్నీరు పెడుతుంటే.. ప్రధాని నవ్వుతూ రీల్స్ చేసుకుంటున్నారు, దానికి బీజేపీ నేతలు చప్పట్లు కొడుతున్నారు. ఇది నాయకత్వం కాదు.. ముమ్మాటికీ నౌటంకీ (డ్రామా)’ అని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు.

వైరల్‌గా మారిన మోడీ-మెలోని వీడియో

ప్రస్తుతం ఇటలీ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ.. అక్కడి ప్రధాని జార్జియా మెలోనికి ఒక మెలోడీ చాక్లెట్ ప్యాకెట్‌ను బహుమతిగా ఇచ్చారు. ఆ చాక్లెట్ ప్యాకెట్‌ను చూపిస్తూ మెలోని.. ‘ప్రధాని మోడీ మా కోసం ఒక మంచి గిఫ్ట్ తెచ్చారు.. చాలా మంచి చాక్లెట్స్’ అని వీడియోలో పేర్కొనగా, మోడీ నవ్వుతూ ‘మెలోడీ’ అని సమాధానమిచ్చారు. ఈ సెల్ఫీ వీడియోను మెలోని తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. ‘గిఫ్ట్ ఇచ్చినందుకు థాంక్యూ’ అని రాశారు. సోషల్ మీడియాలో ‘మెలోడీ’ (Melodi) పేరుతో నెటిజన్లు చేసే మీమ్స్, ట్రెండ్స్‌ను ఉద్దేశించి వీరిద్దరూ సరదాగా నవ్వుకోవడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది. దేశంలో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, ప్రధాని ఇలాంటి గిమ్మిక్కులకు పాల్పడటం సరికాదని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు.

Next Story