హోర్ముజ్ జలసంధిలో తగ్గిన రద్దీ.. భారత LPG ట్యాంకర్ల ప్రయాణానికి సన్నాహాలు

by Kema Shiva Kumar |   (  Updated:2026-03-21 04:05:12  IST  )

పశ్చిమ ఆసియా యుద్ధ ఉద్రిక్తతల నడుమ హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించేందుకు భారత ఎల్‌పీజీ ట్యాంకర్లు సిద్ధమయ్యాయి.

హోర్ముజ్ జలసంధిలో తగ్గిన రద్దీ.. భారత LPG ట్యాంకర్ల ప్రయాణానికి సన్నాహాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఇరాన్-ఇజ్రాయెల్ (Iran-Israel) యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) ద్వారా భారత ఎల్‌పీజీ (LPG) ట్యాంకర్లు తమ ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాయి. యుద్ధ వాతావరణం వల్ల ఈ మార్గంలో నౌకల రద్దీ గణనీయంగా తగ్గిన తరుణంలో భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం యుద్ధ ప్రభావం వల్ల హోర్ముజ్ జలసంధి గుండా వెళ్లే నౌకల సంఖ్య తగ్గింది. దీనిని అవకాశంగా తీసుకుని భారత్‌కు రావాల్సిన ఎల్‌పీజీ ట్యాంకర్లు ప్రయాణానికి సిద్ధమవుతున్నాయి. ఇండియన్ ఫ్లాగ్‌తో ఉన్న ‘పైన్ గ్యాస్’ (Pine Gas), ‘జగ్‌ వసంత్’ (Jag Vasant) అనే రెండు ఎల్‌పీజీ ట్యాంకర్లు హోర్ముజ్ జలసంధిని దాటేందుకు రెడీగా ఉన్నాయి. షిప్పింగ్ డేటా ప్రకారం.. ఈ రెండు నౌకలు ప్రస్తుతం షార్జా (Sharjah) సమీపంలో లంగరు వేసి ఉన్నాయి. ఇవాళ ఉదయం నుంచి ఇవి ప్రయాణాన్ని ప్రారంభించే అవకాశం ఉన్నట్లుగా సంకేతాలు అందుతున్నాయి.

కాగా, భారతదేశపు ఇంధన అవసరాలకు, ముఖ్యంగా వంటగ్యాస్ (LPG) సరఫరాకు ఈ మార్గం అత్యంత కీలకం. గత కొన్ని రోజులుగా నిలిచిపోయిన సరఫరాను తిరిగి పట్టాలెక్కించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. రద్దీ తక్కువగా ఉన్నప్పటికీ, యుద్ధ క్షేత్రం సమీపంలో ఉండటంతో నౌకల భద్రత విషయంలో భారత నావికాదళం, సంబంధిత సంస్థలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. హోర్ముజ్ ద్వారా సరఫరా పున:ప్రారంభం కావడం భారత్‌కు ఊరటనిచ్చే అంశం. అయితే యుద్ధం వల్ల గల్ఫ్ దేశాల ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు జరుగుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ ధరలు ఇప్పటికే ఆకాశాన్నంటుతున్నాయి.

అమెరికా సంచలన నిర్ణయం.. ఇరాన్ చమురుపై ఆంక్షల సడలింపు

Next Story