బిహార్‌లో రికార్డు బ్రేకింగ్ పోలింగ్.. 11 గంటలకే 31.38 శాతం నమోదు

by Malleboina Mahesh |

బిహార్ అసెంబ్లీ ఎన్నికల తుది విడత పోలింగ్ పండగ వాతావరణంలా కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం 7 గంటలకే ప్రారంభం అయిన పోలింగ్.. ప్రశాంతమైన వాతావరణంలో పెద్ద ఎత్తున కొనసాగుతోంది.

బిహార్‌లో రికార్డు బ్రేకింగ్ పోలింగ్.. 11 గంటలకే 31.38 శాతం నమోదు
X

దిశ, వెబ్ డెస్క్: బిహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly Elections) తుది విడత పోలింగ్ పండగ వాతావరణంలా కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం 7 గంటలకే ప్రారంభం అయిన పోలింగ్.. ప్రశాంతమైన వాతావరణంలో పెద్ద ఎత్తున కొనసాగుతోంది. 20 జిల్లాల్లో మొత్తం 122 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుండగా.. 1,302 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందుకోసం మొత్తం 45,399 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా తెల్లవారుజామునుంచే ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు పోటెత్తారు.

దీంతో అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో 11 గంటల వరకు బిహార్‌లో రికార్డు స్థాయిలో 31. 38 శాతం పోలింగ్ నమోదు అయినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. మొత్తం 21 జిల్లాలలో ఉదయం 11 గంటల వరకు అత్యధిక ఓటింగ్: కిషన్‌గంజ్ జిల్లాలో 34.74% శాతం నమోదు కాగా అత్యల్పంగా మధుబనీ జిల్లాలో 28.66 శాతం నమోదు అయింది. అలాగే గయా – 34.07, జముఈ – 33.69, పూర్ణియా – 32.94, పశ్చిమ చంపారన్ – 32.39, నవాడా – 29.02, సీతామర్హి – 29.81 శాతం ఓట్లు పోలైనట్లు ప్రకటించారు.

పోలింగ్ సరళి ఇలాగే కొనసాగితే.. మొదటి విడత పోలింగ్ రికార్డుతో పాటు బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రికార్డులను సైతం బ్రేక్ చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే గతంలో ఎన్నడూ లేని విధంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు పాల్గొనే విధంగా ఎన్నికల అధికారులు అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. దీంతోనే ప్రజలు పెద్ద ఎత్తున ఓటు వేసేందుకు తరలి వస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. మరి సాయంత్రానికి బిహార్ ఓట్ల పోలింగ్ శాతం ఎంత నమోదవుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

Next Story