Congress: 2025 చివర్లో రాహుల్ గాంధీకి కొత్త చిక్కులు.. కాంగ్రెస్ నేత ట్వీట్‍కు ఇండియా కూటమిలో రచ్చ రచ్చ

by Prasad Jukanti |

2026లో రాహుల్ గాంధీ ముందున్న అసలైన సవాళ్లు ఎదురు చూస్తున్నాయి.

Congress: 2025 చివర్లో రాహుల్ గాంధీకి కొత్త చిక్కులు.. కాంగ్రెస్ నేత ట్వీట్‍కు ఇండియా కూటమిలో రచ్చ రచ్చ
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇండియా కూటమికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీకి 2025 నిరాశనే మిగిల్చింది. ఢిల్లీ, బిహార్ ఎన్నికల రూపంలో ఘోరంగా దెబ్బ తిన్న కాంగ్రెస్ పార్టీకి రాబోయే 2026 అసలైన అగ్నిపరీక్షగా మారబోతోంది. వచ్చే ఏడాది అస్సాం, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక్కడ సత్తా చాటడం ఇండియా కూటమికి (INDIA Alliance) ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకంగా మారింది. కేంద్రంలో మూడో సారి కొద్దిలో గట్టెక్కిన బీజేపీ ఆపై జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగులేని ఫలితాలు నమోదు చేసుకుంటుంటే కాంగ్రెస్ మాత్రం ఓటములు మూటగట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో కొత్త ఏడాది హస్తం పార్టీకి అసలైన సవాలుగా మారనుందనే చర్చ రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. ఇక ఇదిలా ఉంటే ఇండియా కూటమి విషయంలో కొత్త అనుమానాలు చర్చనీయాశంగా మారాయి. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న తమిళనాడులో కూటమిగా ఉన్న కాంగ్రెస్, అధికార డీఎంకే మధ్య కాంగ్రెస్ కీలక నేత ట్వీట్ దుమారం రేపుతోంది. ఈ వ్యవహారం 2025 ముంగింపు వేళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి (Rahul Gandhi) రాబోయే కొత్త ఏడాదిలో కొత్త సమస్యలు తీసుకురాబోతోందా అనే టాక్ గుప్పుమంటోంది

కాంగ్రెస్ వర్సెస్ డీఎంకే:

తమిళనాడులో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు డీఎంకే ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో తమిళనాడు రుణాల అంశంపై కాంగ్రెస్ పార్టీ డేటా యూనిట్ చీఫ్ ప్రవీణ్ చక్రవర్తి చేసిన (Praveen Chakravarthy Tweet Row) ఓ ట్వీట్ ఇరు పార్టీల మధ్య రచ్చ రేపింది. ప్రవీణ్ చక్రవర్తి తన ఎక్స్ (ట్విట్టర్)లో చేసిన పోస్టులో తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల అప్పులను పోల్చారు. తమిళనాడుకే దేశంలో అత్యధిక పెండింగ్ అప్పులు ఉన్నాయని, అధిక వడ్డీ భారం, అధిక అప్పు–జీడీపీ నిష్పత్తి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆందోళనకరంగా మార్చిందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు కాంగ్రెస్–డీఎంకే (Congress vs DMK) మధ్య కొత్త రాజకీయ దుమారానికి దారితీశాయి. ప్రవీణ్ చక్రవర్తిపై చర్యలు తీసుకోవాలంటూ డీఎంకే నేతలు రాహుల్ గాంధీని డిమాండ్ చేస్తున్నారు. ప్రవీణ్ చక్రవర్తి చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో రాజకీయంగా పట్టు సాధించాలని చూస్తున్న బీజేపీకి అవకాశం కల్పిస్తున్నాయని డీఎంకే ఎటాక్ చేస్తోంది. వెంటనే ప్రవీణ్ చక్రవర్తిపై చర్యలు తీసుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. అయితే డీఎంకే డిమాండ్‍పై కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ అంతే స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. ‘కూటమి భాగస్వాములు కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలను ఎలా నిర్వహించాలో ఆదేశించడం ఎప్పటి నుంచి మొదలుపెట్టారు? ఇలాంటి బహిరంగ వ్యాఖ్యలను వారి పార్టీల విషయాల్లో వారు అంగీకరిస్తారా?’ అంటూ డీఎంకేపై రివర్స్ ఎటాక్ చేశారు. దీంతో ఇండియా కూటమిలోని ఇరుపార్టీల మధ్య డైలాగ్ వార్ ఇయర్ ఎండింగ్‍లో పొలిటికల్ క్రాకర్స్ కు కేరాఫ్ గా మారింది. ఇరు పార్టీల వ్యవహారంపై బీజేపీ ప్రతినిధి సీఆర్ కేశవన్ స్పందిస్తూ తమిళనాడులో డీఎంకే–కాంగ్రెస్ ఇండీ కూటమి పూర్తిగా చీలిపోయిందని రోజురోజుకీ కూలిపోతూ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం దిశగా ఈ కూటమి వెళ్తోందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేత ట్వీట్ తో చెలరేగిన ఈ వివాదం తమిళ రాజకీయాల్లో ఏ మలుపుకు తీసుకువెళ్తుందో చూడాలి.

రాహుల్ కు మహారాష్ట్ర సవాల్:

తమిళనాడులో ఇండియా కూటమి వ్యవహారం ఇలా ఉంటే మహారాష్ట్రలో తీరు మరింత రసవత్తరంగా మారింది. మహారాష్ట్రలో జరుగుతున్న లోకల్ బాడీ ఎన్నికల వేళ ఇండియా కూటమిలో చిత్రవిచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ఇండియా కూటమిలో కీలకంగా ఉన్న ఉద్ధవ్ థాక్రే ఇటీవల తన సోదోరుడు రాజ్ థాక్రేతో మళ్లీ కలిసిపోయారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత థాక్రే సోదరులు మళ్లీ ఏకం కావడం మరాఠ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే ఇండియా కూటమిలో కూలంగా ఉన్న శరద్ పవార్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మళ్లీ కలిసిపోయారు. శరద్ పవార్-అజిత్ పవార్‌ (Sharad Pawar-Ajit Pawar) నాయకత్వాల్లోని ఎన్‌సీపీ (ఎస్పీ)-ఎన్‌సీపీ పార్టీలు పింప్రీ-చించ్వాడ్‌ ఎన్నికల బరిలోకి దిగనున్నాయి. ఈ విషయాన్ని మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ వెల్లడించారు. ఈ కొత్త కూటమికి తన బాబాయ్ శరద్ పవార్ నాయకత్వం వహిస్తారని పేర్కొన్నారు. అయితే మహారాష్ట్రలో ఇండియా కూటమిలో కీలకంగా ఉన్న ఉద్ధవ్ థాక్రే, అజిత్ పవార్ లు తిరిగి తమ కుటుంబ సభ్యులతో కలిసిపోవడం రాజకీయ వర్గాల్లో కొత్త చర్చలకు దారి తీస్తోంది. వీరి కలయికతో సానుకూల ఫలితాలు వస్తే వీరు ఇండియా కూటమిలోనే కొనసాగుతారా లేక ఇక్కడితో స్వస్తి పలికి తమ దారులు తాము వెతుక్కుంటారా అనేది సస్పెన్స్ గా మారింది. ఇప్పటికే ఆమ్ ఆద్మీ ఇండియా కూటమికి రామ్ రామ్ చెప్పింది. యూపీలో అఖిలేశ్ యాదవ్ ఇండియా కూటమితో పూర్తి స్థాయిలో కలిసిపోవడం లేదనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి ఇండియా కూటమి బలంగా ఉండాలంటే 2026 రాహుల్ గాంధీకి అగ్నిపరీక్షగా మారిందని ఓ వైపు కూటమిని నిలబెట్టుకుంటూనే కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు చక్కదిద్దుకోవాలనే టాక్ వినిపిస్తోంది. మరో అంతిమంగా రాహుల్ గాంధీ వీటన్నింటిని ఎలా పరిష్కరించుకుంటారు అనేది వేచి చూడాలి.

Next Story