- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లోన్ రికవరీ పేరుతో వేధింపులు.. కీలక ఆదేశాలు జారీ చేసిన ఆర్బీఐ
లోన్ రికవరీ పేరుతో జరుగుతున్న వేధింపులకు అడ్డుకట్ట వేసేలా ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. రికవరీ ఏజెంట్ల తప్పిదాల వల్ల కస్టమర్ నష్టపోతే బ్యాంకే పరిహారం చెల్లించాలని స్పష్టం చేసింది. ఇకపై ఎవరినైనా రికవరీ ఏజెంట్లుగా నియమించడానికి వీల్లేదని తెలిపింది.

దిశ, వెబ్ డెస్క్: లోన్ రికవరీ పేరుతో జరుగుతున్న వేధింపులకు అడ్డుకట్ట వేసేలా ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. రికవరీ ఏజెంట్ల తప్పిదాల వల్ల కస్టమర్ నష్టపోతే బ్యాంకే పరిహారం చెల్లించాలని స్పష్టం చేసింది. ఇకపై ఎవరినైనా రికవరీ ఏజెంట్లుగా నియమించడానికి వీల్లేదని తెలిపింది. ఏజెంట్ గా నియమించాలంటే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ లేదా గుర్తింపు పొందిన సంస్థల సర్టిఫికేట్ ఉండాలని స్పష్టం చేసింది. రికవరీ ఏజెంట్ల పూర్తి వివరాలు బ్యాంకుల వెబ్‌సైట్, యాప్స్‌లో ముందుగానే అందుబాటులో ఉండాలని పేర్కొంది. కస్టమర్ ఇంటికి మొదటిసారి వెళ్లే ముందు కనీసం ఒక రోజు ముందే సమాచారం ఇవ్వాలని స్పష్టం చేసింది.
ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల మధ్య మాత్రమే కస్టమర్లను సంప్రదించాలని ఆదేశించింది. రికవరీ ఏజెంట్లు సభ్యతగా, మర్యాదగా మాట్లాడాలని స్పష్టం చేసింది. అసభ్య పదజాలం, బెదిరింపులు, పదే పదే కాల్స్ చేసి వేధించడం పూర్తిగా నిషేధమని తెలిపింది. కస్టమర్ల బంధువులు, సహోద్యోగులను సైతం ఇబ్బంది పెట్టకూడదని ఆదేశించింది. వ్యక్తిగత వివరాలు, ఆడియో/వీడియో రికార్డింగులను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం నిషేధం అని తెలిపింది. కస్టమర్ మొబైల్‌లోని కాంటాక్ట్స్, ఫోటోలు వంటి డేటాను యాక్సెస్ చేయడం లేదా స్టోర్ చేయడంపైనా నిషేధం విధించింది. లోన్ రికవరీ కోసం మొబైల్ ఫోన్ ఫీచర్లను బ్లాక్ చేసే టెక్నాలజీ వినియోగించకూడదని ఆదేశించింది.
మొబైల్ కొనుగోలు లోన్ అయితే గడువు ముగిసి 90 రోజులు దాటిన తర్వాత మాత్రమే ముందస్తు నోటీసుతో ఫోన్ లాక్ చేయాలని తెలిపింది. నిబంధనలకు విరుద్ధంగా ఫోన్ సర్వీసులు నిలిపితే ప్రతి గంటకు రూ.250 చొప్పున కస్టమర్‌కు పరిహారం చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. రికవరీ కోసం చేసే ప్రతి కాల్ సమయం, నంబర్, సంభాషణను బ్యాంకులు రికార్డ్ చేయాలని పేర్కొంది. కాల్ రికార్డులను కనీసం 6 నెలలు భద్రపరచాలని, కోర్టు కేసులు ఉంటే కేసు పూర్తయ్యే వరకు డేటా స్టోర్ చేయాలని చెప్పంది. కొత్త రూల్స్‌తో రుణగ్రహీతల గౌరవం, వ్యక్తిగత స్వేచ్ఛకు పూర్తి రక్షణ కల్పిస్తున్నామని ఆర్బీఐ వెల్లడించింది. ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత అక్టోబర్ 1, 2026 నుంచి కొత్త రూల్స్ అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది.






