పెరోల్‌పై 15వ సారి బయటకు వచ్చిన డేరా బాబా.. వ్యతిరేకిస్తోన్న సిక్కు సంస్థలు

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-01-05 15:18:12  IST  )

ఇద్దరు మైనర్లపై అత్యాచారం చేసిన కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న డేరా బాబా 15వ సారి పెరోల్ పై బయటికి వచ్చాడు.

పెరోల్‌పై 15వ సారి బయటకు వచ్చిన డేరా బాబా.. వ్యతిరేకిస్తోన్న సిక్కు సంస్థలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఇద్దరు మైనర్లపై అత్యాచారం చేసిన కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌదా అధిపతి గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ 15వ సారి పెరోల్ పై బయటికి వచ్చాడు. హర్యానాలోని రోహ్ తక్ లో సునరయి జైలులో శిక్ష అనుభవిస్తున్న డేరా బాబాకు ఆదివారం హర్యానా ప్రభుత్వం 40 రోజుల పెరోల్ మంజూరు చేయగా.. సోమవారం జైలు నుంచి విడుదలయ్యాడు. ఈ 40 రోజులు అతను సిర్సాలోని డేరా ప్రధాన కార్యాలయంలో ఉంటాడని గుర్మీత్ అధికార ప్రతినిధి, న్యాయవాది జితేందర్ ఖురానా వెల్లడించారు. 2017లో బాలికలపై అత్యాచారం చేసినట్లు నిర్ధారణ కావడంతో కోర్టు 20 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. 2017 ఆగస్టులో అతనికి శిక్ష విధించగా.. అప్పటి నుంచి ఇప్పటి వరకూ.. సుమారు 8 సంవత్సరాల కాలంలో 15 సార్లు పెరోల్ పై బయటికి వచ్చాడు.

ఎన్నికల ముందు పెరోల్ పై బయటకు

16 సంవత్సరాల క్రితం జర్నలిస్ట్ రామ్ చందర్ ఛత్రపతి హత్యకేసులో 2019లో డేరాబాబాను కోర్టు దోషిగా తేల్చింది. 2020లో అక్టోబర్ 1న అనారోగ్యంతో ఉన్న తన తల్లిని చూసేందుకు ఒకరోజు పెరోల్ పై విడుదలయ్యాడు. ఆ తర్వాత 2021 మే 21న కూడా తల్లిని చూసేందుకు 12 గంటల పెరోల్ పై బయటికి వచ్చాడు. 2022 ఫిబ్రవరిలో పంజాబ్ ఎన్నికలకు ముందు 7వ తేదీన 21 రోజులు, అదే ఏడాది జూన్ లో 30 రోజులు, అక్టోబర్ లో 40 రోజులపాటు పెరోల్ పై బయటికి వచ్చాడు. 2023 జనవరిలో 40 రోజులు, జులైలో 30 రోజులు, నవంబర్ లో 21 రోజులు, 2024 జనవరిలో 50 రోజులు, ఆగస్టులో 21 రోజులు, అక్టోబర్ లో హర్యానా ఎన్నికల ముందు 20 రోజులు పెరోల్ పొందాడు. 2025 జనవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు 30 రోజులు, ఏప్రిల్ లో 21 రోజులు, ఆగస్టులో 40 రోజులు పెరోల్ పై డేరా బాబా బయటికి వచ్చాడు. తాజాగా ఫిబ్రవరిలో పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో మరోసారి 40 రోజుల పెరోల్ పై విడుదలయ్యాడు. మొత్తంగా 15 సంవత్సరాల్లో 405 రోజులపాటు డేరా బాబా పెరోల్ పొందాడు. అంటే అతనికి విధించిన 20 ఏళ్ల శిక్షకాలంలో ఒక ఏడాది శిక్ష తగ్గినట్లే. ఇలా పదే పదే డేరాబాబాకు పెరోల్ మంజూరు చేయడాన్ని సిక్కు సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

అసలు కేసు ఏంటి?

సేవా, సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ.. 19 గిన్నీస్ బుక్ రికార్డులు సాధించిన డేరాబాబాను అత్యాచారం కేసు చిక్కుల్లో పడేసింది. ఈ ఆధ్యాత్మిక గురువు రాసలీలలను వివరిస్తూ 2002లో ఓ బాధితురాలు రాసిన లేఖ సంచలనం రేపింది. తన పేరు బయటపెట్టకుండా.. అతని బాగోతాలను వివరిస్తూ ఓ సాధ్వి అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పేయీ, పంజాబ్ - హర్యానా హైకోర్టు చీఫ్ జస్టిస్ లకు రాసిన లేఖ ఆధారంగా సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. తనతోపాటు కొందరు మహిళలను లైంగికంగా వేధించినట్లు ఆమె లేఖలో ఆరోపించింది. అతనిపై అత్యాచారం, హత్యకేసులు నమోదయ్యాయి. లేఖ ఆధారంగా పంజాబ్ - హర్యానా హైకోర్టు 2002 మే లో సిర్సా డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి ద్వారా విచారణకు ఆదేశించింది. 2002 డిసెంబరులో డేరా బాబాపై ఐపీసీ సెక్షన్ 376 ప్రకారం క్రిమినల్ ఇంటిమిడేషన్ అండ్ ఇతర ఆరోపణలతో కేసు నమోదయ్యింది. 2007లో సీబీఐ చార్జ్ షీటును దాఖలు చేసింది. ఈ కేసు విచారణ పూర్తయి శిక్ష పడేందుకు 15 సంవత్సరాలు పట్టింది. 2017 ఆగస్టు 25న పంచ్కులాలోని స్పెషల్ సీబీఐ కోర్టు గుర్మీత్ రామ్ రహీమ్ ను రెండు అత్యాచార కేసుల్లో దోషిగా తేల్చింది. ఆగస్టు 28న ఒక్కో కేసుకు 10 సంవత్సరాల చొప్పున 20 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.

జర్నలిస్టు హత్యకేసులో జీవితఖైదు

జర్నలిస్ట్ రామ్ చందర్ ఛత్రపతి.. అత్యాచార ఆరోపణలతో వచ్చిన లేఖను పూరా సచ్ అనే హిందీ సాయంత్ర పత్రికలో ప్రచురించడంతో.. అతడిని డేరా బాబా హత్య చేయించినట్లు కేసు నమోదయింది. 2002 అక్టోబర్ 24న రామ్ చందర్ హత్యకు గురికాగా.. నిందితులు కులదీప్ సింగ్, నిర్మల్ సింగ్ లను పోలీసులు అరెస్ట్ చేసి, ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 2003 జనవరిలో అతని కుమారుడు అన్శుల్ ఛత్రపతి పంజాబ్ - హర్యానా హైకోర్టులో పిటిషన్ వేసి కేసులో సీబీఐ ఎంక్వైరీ కోరారు. 2006లో ఈ కేసును సీబీఐ తీసుకుని విచారించింది. 2007 జులైలో డేరాబాబ్ తో సహా నిందితులపై ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. 2019 జనవరి 11న స్పెషల్ సీబీఐ కోర్టు గుర్మీత్ రామ్ రహీమ్ ను జర్నలిస్ట్ హత్యకేసులో జీవిత ఖైదు విధించింది. ఈ కేసు దీర్ఘకాల విచారణ, తుది తీర్పు వెల్లడించేందుకు 17 ఏళ్ల కాలం పట్టింది.

Next Story