రామ‌య్య విరాళాలకే ఎసరు.. 60 కిలోల వెండి మాయం!

by Thanuru Gopichand |

అయోధ్య రామాలయానికి భక్తులు సమర్పించిన విరాళాలు, విలువైన వస్తువుల నిర్వహణలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి.

రామ‌య్య విరాళాలకే ఎసరు.. 60 కిలోల వెండి మాయం!
X

దిశ‌, నేష‌న‌ల్ బ్యూరో: అయోధ్య రామాలయానికి భక్తులు సమర్పించిన విరాళాలు, విలువైన వస్తువుల నిర్వహణలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఆలయ కలెక్షన్ రికార్డుల నుండి సుమారు 60 కిలోల బరువైన వెండి ఇటుకలు మాయమయినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) విచారణలో తేలింది. ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న స్వర్ణకారుల సంఘం (జ్యువెలర్స్ అసోసియేషన్) ఈ వెండిని రామ్ లల్లాకు సమర్పించగా, వీటిని ఆలయ పునాదిలో ఉంచేందుకు కేటాయించారు. అయితే, వీటికి సంబంధించిన ఎలాంటి రసీదులు, నిల్వ వివరాలు ఆలయ రికార్డుల్లో లభ్యం కాకపోవడం గమనార్హం. విరాళంగా ఇచ్చిన అసోసియేషన్ ప్రతినిధులు మాత్రం తాము ఆలయ ట్రస్ట్‌కు వెండిని అందజేసినట్లు రసీదు ఉందని స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన లక్నో కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల సిట్ బృందం ఆలయ పూజారులను, నగలను పర్యవేక్షించే సిబ్బందిని విచారించింది. వెండి ఇటుకలతో పాటు ఒక నెక్లెస్, పాదుకలు కూడా కనిపించకుండా పోయినట్లు సమాచారం. ఆలయంలోని అసలు ఆభరణాల స్థానంలో నకిలీవి ఉంచారని, నగదు విరాళాలను దారి మళ్లించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కాగా, ట్రస్ట్ అభ్యర్థన మేరకే విచారణకు ఆదేశించామని, మరో 15 రోజుల్లో పూర్తి నిజాలు బయటకు వస్తాయని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు.

Next Story