Congress: మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలపై రాజ్యసభలో దుమారం.. సారీ చెప్పిన విపక్ష నేత

by S Gopi |

ఖర్గె జోక్యం చేసుకుంటూ, కేంద్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరిని అవలంబిస్తోందన్నారు.

Congress: మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలపై రాజ్యసభలో దుమారం.. సారీ చెప్పిన విపక్ష నేత
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై మంగళవారం రాజ్యసభలో దుమారం చెలరేగింది. ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన తర్వాత విద్యా మంత్రిత్వ శాఖ పని తీరుపై చర్చను చేపట్టగా, తమిళనాడు ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలకు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ క్షమాపణ చెప్పాలని పలువురు విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. ఇది రాజకీయాల కోసం రాష్ట్రంలో 'విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తుందని' ఆరోపించారు. ఈ గందరగోళ కొనసాగుతున్న సమయంలోనే మల్లికార్జున ఖర్గె జోక్యం చేసుకుంటూ, ఈ అంశంపై తాను మాట్లాడే సమయంలో విద్యా శాఖ మంత్రి లేరని, కేంద్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరిని అవలంబిస్తోందన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కార్నర్ చేసేందుకు ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయని ఖర్గే చెబుతూనే, హిందీలో 'ఆప్‌కో క్యా క్యా ఠోకనా హై, ఠీక్‌సే ఠోకేంగే'(తిరిగి కొడతాం అనే భావన వచ్చేలా) మాటను వాడారు. దీనిపై భగ్గుమన్న అధికార పక్షం ఖర్గె వాడిన పదజాలం సరైంది కాదని, సభాపతిని ఉద్దేశిస్తూ అటువంటి వ్యాఖ్యలు చేయడమేంటనీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఖర్గె క్షమాపణలు చెప్పాలని రాజ్యసభ పక్షనేత జేపీ నడ్డా డిమాండ్ చేశారు. తన వ్యాఖ్యలపై స్పష్టత ఇచ్చిన ఖర్గె, సభకు క్షమాపణలు చెప్పారు. తాను డిప్యూటీ ఛైర్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కాదని, ప్రభుత్వాన్ని విమర్శించే క్రమంలో చెప్పినవని వివరణ ఇచ్చారు. నా వ్యాఖ్యలు మిమ్మల్ని బాధపెడితే మన్నించండి, నేను మీకు క్షమాపణలు చెబుతున్నాను అని ఆయన చెప్పారు.

Next Story