Rajya sabha: జూన్ 19న ఎనిమిది రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు.. షెడ్యూల్ ప్రకటించిన ఈసీ

by B.Srinivas |

ఎనిమిది రాజ్యసభ స్థానాలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. అందులో అసోం నుంచి రెండు, తమిళనాడు నుండి ఆరు స్థానాలు ఉన్నాయి.

Rajya sabha: జూన్ 19న ఎనిమిది రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు.. షెడ్యూల్ ప్రకటించిన ఈసీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ఎనిమిది రాజ్యసభ స్థానాలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. అందులో అసోం (Assam) నుంచి రెండు, తమిళనాడు (Tamilnadu) నుంచి ఆరు స్థానాలు ఉన్నాయి. దీనికి గాను జూన్ 19న పోలింగ్ జరగనుండగా అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు జరగనుంది. జూన్, జూలైలలో ప్రస్తుత సభ్యుల పదవీకాలం పూర్తవుతుంది. జూన్ 2న ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది. అసోం నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్న బీరేంద్ర ప్రసాద్ బైశ్యా, మిషన్ రంజన్ దాస్ పదవీకాలం జూన్ 14న, తమిళనాడులోని సభ్యుల పదవీకాలం జూలై 24న పూర్తి కానుంది. ఈ లోపే కొత్త సభ్యులను భర్తీ చేయనున్నారు.

తమిళనాడులో పీఎంకే నేత అన్బుమణి రామదాస్, ఏఐడీఎంకే సభ్యుడు ఎన్ చంద్రశేఖరన్, డీఎంకే ఎంపీ షణ్ముగం, విల్సన్, ఎండీఎంకే నుంచి వైకోల పదవీకాలం ముగియనుంది. కొవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా, ఎన్నికలను సురక్షితంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తామని, అవసరమైన ప్రోటోకాల్‌లను అమలు చేస్తామని ఈసీ తెలిపింది. అంతకుముందు నాలుగు రాష్ట్రాల్లోని ఐదు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలను ప్రకటించిన విషయం తెలిసిందే.

Next Story