బీఏసీ సమావేశం నుంచి వెళ్లిపోయిన చైర్మన్ జగదీప్ ధన్‌కర్

by Ajay Maddhiboyina |

ఎపిక్ కార్డులు, మణిపూర్‌లో పరిస్థితులపై చర్చకు ప్రభుత్వం సమయం కేటాయించాలని ప్రతిపక్ష వర్గాలు కోరుతున్నాయి.

బీఏసీ సమావేశం నుంచి వెళ్లిపోయిన చైర్మన్ జగదీప్ ధన్‌కర్
X

- సభ్యుల మధ్య కుదరని రాజీ

- ఎపిక్ నంబర్లు, స్టాండింగ్ కమిటీపై చర్చకు ప్రతిపక్షాల పట్టు

- అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వివాదం

- సమావేశం నుంచి వాకౌట్ చేసిన రాజ్యసభ చైర్మన్

దిశ, నేషనల్ బ్యూరో: ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కర్ బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ) సమావేశం నుంచి వెళ్లిపోయారు. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మర్యాద, ఔచిత్యం లేకపోవడంతో అసంతృప్తి చెందిన జగదీప్ ధన్‌కర్ సమావేశం నుంచి వాకౌట్ చేసినట్లు రాజ్యసభ సెక్రటేరియట్ వర్గాలు తెలిపాయి. బడ్జెట్ సమావేశాల చివరి వారం కావడంతో.. రాజ్యసభలో చర్చించాల్సిన అంశాలపై శుక్రవారం బీఏసీ ఏర్పాటు చేశారు. కాగా, సమావేశానికి హాజరైన ఎంపీలు డూప్లికేట్ ఎలక్టోరల్ ఫొటో ఐడెంటిటీ కార్డు నంబర్లు, బిల్లులను పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి పరిశీలనకు పంపడంపై చర్చించాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. ఈ విషయంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. ఓటర్ ఐడీ కార్డుకు సంబంధించిన అంశం చర్చకు రాలేదని ప్రతిపక్ష సభ్యులు చెప్పారు. దీనిపై సభలో చర్చ జరగాల్సిందేనని పట్టుబట్టారు. ఈ అంశంలో ఇరు వర్గాలు వెనక్కి తగ్గకపోవడంతో సమావేశంలో గందరగోళం ఏర్పడింది.

ఎపిక్ కార్డులు, మణిపూర్‌లో పరిస్థితులపై చర్చకు ప్రభుత్వం సమయం కేటాయించాలని ప్రతిపక్ష వర్గాలు కోరుతున్నాయి. వివిధ అంశాలపై నోటీసులు సమర్పిస్తున్నా చైర్మన్ అనుమతించడం లేదని ప్రతిపక్ష సభ్యులు చెప్పారు. ప్రతిపక్ష ఎంపీలు ప్రభుత్వ వ్యవహారాలకు మద్దతు ఇస్తూనే.. తాము చర్చించాలనుకున్న అంశాలను జాబితాలో చేర్చడం లేదని మండిపడ్డారు. ఈ విషయంలో ప్రతిపక్ష, అధికార పక్ష సభ్యుల మధ్య ప్రతిష్టంభన ఏర్పడింది. ఈ భిన్నాభిప్రాయాల మధ్య చైర్మన్ జగదీప్ ధన్‌కర్ సమావేశం నుంచి వాకౌట్ చేసినట్లు ప్రతిపక్ష సభ్యులు చెప్పారు. సమాజ్‌వాది పార్టీ నాయకులు రాంజీ లాల్ సుమన్ చేసిన వ్యాఖ్యలపై ఎగువ సభలో ట్రెసరీ, ప్రతిపక్ష బెంచ్‌ల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకున్న రోజే బీఏసీ సమావేశం ఏర్పాటు చేయడం గమనార్హం.

Next Story