- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Rajnath singh: దేశ ప్రజలు కోరుకునేదే జరుగుతుంది.. రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు
పహెల్గాం దాడి తర్వాత నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ పాక్ యుద్ధం జరుగుతుందనే ఊహాగానాల వేళ రాజ్ నాథ్ సింగ్ సంచలన ప్రకటన చేశారు.

దిశ, నేషనల్ బ్యూరో: పహెల్గాం దాడి తర్వాత నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ పాక్ యుద్ధం జరుగుతుందనే ఊహాగానాల వేళ కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ (Rajnath singh) సంచలన ప్రకటన చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశ ప్రజలు కోరుకునేది ఖచ్చితంగా జరిగి తీరుతుందని నొక్కి చెప్పారు. ప్రధాని మోడీ నాయకత్వంలో ప్రజలు ఆకాంక్షించేదే జరుగుతుందని తెలిపారు. ఉగ్రదాడిపై కఠినంగా స్పందిస్తామని త్వరలోనే తగిన ప్రతిస్పందన ఉంటుందని స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో ఆదివారం జరిగిన సంస్కృతి జాగరణ్ మహోత్సవంలో ఆయన ప్రసంగించారు. ‘ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ దృడ సంకల్పం గురించి బాగా తెలుసు. ఆయన తీసుకునే నిర్ణయాలు కఠినంగా ఉంటాయి. మోడీ నాయకత్వంలో దేశ ప్రజలు ఏది కోరుకుంటే అది తప్పకుండా జరుగుతుంది. ఈ విషయంలో నేను హామీ ఇస్తున్నా’ అని వ్యాఖ్యానించారు. ఉగ్రదాడిపై ప్రభుత్వం అవసరమైన, సముచితమైన ప్రతీకార చర్య తీసుకుంటుందని తెలిపారు.
ఉగ్రదాడులకు తగిన సమాధానం
దేశ సరిహద్దులను రక్షించాలని, దేశ సార్వభౌమత్వాన్ని సవాల్ చేసే వారికి తగిన సమాధానం చెప్పాలన్నారు. రక్షణ మంత్రిగా సైనికులతో పాటు దేశాన్ని సురక్షితంగా ఉంచడమే నా బాధ్యత అని చెప్పారు. దేశంపై దాడి చేయడానికి ధైర్యం చేసే ఎవరికైనా దీటుగా సమాధానం ఇస్తామన్నారు. వారు తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటారని హెచ్చరించారు. భారత్ బలం కేవలం సాయుధ బలగాల్లోనే గాక దాని సంస్కృతి, ఆద్యాత్మికతలోనూ ఉందన్నారు. జవాన్లు దేశ భౌతిక సరిహద్దులను రక్షిస్తుండగా, సాధువులు ఋషులు దేశ ఆధ్యాత్మికతను కాపాడుతారన్నారు. ప్రపంచంలోని ఏ శక్తి భారతదేశాన్ని నాశనం చేయలేదని దీమా వ్యక్తం చేశారు.
యుద్ధంపై పరోక్ష సంకేతం!
ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి అనంతరం పాకిస్థాన్ పట్ల దేశ ప్రజల్లో ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. పాకిస్థాన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని దేశ వ్యాప్తంగా డిమాండ్లు ఊపందుకున్నాయి. ప్రధాని మోడీ త్రివిధ దళాల ఉన్నతాధికారులతో వరుస సమావేశాలు నిర్వహించారు. ఉగ్రదాడిపై నిర్ణయం తీసుకునే స్వేచ్చను సాయుధ దళాలకే వదిలేశారు. అప్పటి నుంచి పాక్ పై అటాక్ జరుగుతుందని పలు మీడియా కథనాలు వెల్లడించాయి. పాకిస్థాన్ కు చెందిన పలువురు ప్రతినిధులు సైతం భారత్ దాడి చేయబోతుందని వ్యాఖ్యానించారు. దీంతో ఈ విషయంపై ఉత్కంఠ నెలకొన్న వేళ రాజ్ నాథ్ సింగ్ ప్రకటన హాట్ టాపిక్‌గా మారింది. ఆయన వ్యాఖ్యలు పరోక్షంగా పాక్‌కు వార్నింగ్ ఇచ్చినట్టే ఉన్నాయని, భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం జరగొచ్చనే సంకేతాలు వెల్లడించారని పలువురు భావిస్తున్నారు.






