Rajasthan MLA : అవినీతి కేసులో రాజస్థాన్ ఎమ్మెల్యే జైకృష్ణ పటేల్ అరెస్టు

by Shamantha N |

అవినీతి కేసులో రాజస్థాన్ ఎమ్మెల్యే అరెస్టయ్యారు. అసెంబ్లీలో అవినీతిపై ప్రశ్నలు సంధించేందుకు రెడీ అయిన ఎమ్మెల్యే... ఆ తర్వాత ప్రశ్నలు అడగకుండా ఉండేందుకు లంచం తీసుకున్నారు.

Rajasthan MLA : అవినీతి కేసులో రాజస్థాన్ ఎమ్మెల్యే జైకృష్ణ పటేల్ అరెస్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: అవినీతి కేసులో రాజస్థాన్ ఎమ్మెల్యే అరెస్టయ్యారు. అసెంబ్లీలో అవినీతిపై ప్రశ్నలు సంధించేందుకు రెడీ అయిన ఎమ్మెల్యే... ఆ తర్వాత ప్రశ్నలు అడగకుండా ఉండేందుకు లంచం తీసుకున్నారు. దీంతో, ఆయన అరెస్టయ్యారు. బాగిడోరాకు చెందిన భారత్‌ ఆదివాసీ పార్టీ (BAP) ఎమ్మెల్యే జైకృష్ణ పటేల్ (Jaikrishn Patel)‌.. అసెంబ్లీలో మైనింగ్‌ సంబంధించి మూడు ప్రశ్నలు అడిగేందుకు సిద్ధమయ్యారు. అయితే, వాటిని తొలగించేందుకు సంబంధిత మైనింగ్‌ కంపెనీ ఎమ్మెల్యేను సంప్రదించింది. దీనికిగాను జైకృష్ణ రూ.10 కోట్లు డిమాండ్‌ చేశారు. అయితే అది రూ.2.5 కోట్లకు ఒప్పందం కుదిరింది. కాగా.. తొలుత సంబంధిత కంపెనీ అతనికి రూ.లక్ష అందించింది. రెండో విడతత్లో భాగంగా రూ.20 లక్షలు ఇవ్వాల్సి ఉండగా.. బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. దీంతో అధికారులు ఎమ్మెల్యేపై అధికారులు కన్నేసి ఉంచారు. ఈ క్రమంలో డబ్బు ఇచ్చేందుకు జైపూర్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు రావాలని సంబంధిత వ్యక్తులకు ఎమ్మెల్యే జైకృష్ణ సూచించారు. దీంతో వారు ఆయన క్వార్టర్స్‌లో రూ.20 లక్షలు అందించారు. ఆ మొత్తాన్ని లెక్కించిన తర్వాత ఆయన తన సహాయకుడితో పంపించారు. ఇంతలో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఎమ్మెల్యేను అరెస్టు చేశారు. అయితే అప్పటికే ఆ వ్యక్తి బ్యాగుతో అక్కడినుంచి పరారయ్యాడు. దీంతో అతనికోసం గాలిస్తున్నారు

ఓ ఎమ్మెల్యే పట్టుబడటం తొలిసారి..

అయితే, లంచం తీసుకుంటుండగా ఓ ఎమ్మెల్యే పట్టుబడటం రాష్ట్ర ఏసీబీ చరిత్రలో ఇదే తొలిసారని ఏసీబీ డీజీ రవిప్రకాశ్‌ మెహ్రాదా చెప్పారు. రవీంద్ర సింగ్‌ అనే వ్యక్తి ఏప్రిల్‌ 4న తమకు ఫిర్యాదు చేశారని చెప్పారు. అప్పటి నుంచి ఎమ్మెల్యేను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. లంచం మొత్తాన్ని విడతలవారీగా చెల్లించాలని నిర్ణయించారని, ఇందులో భాగంగా రూ.20 లక్షలు తీసుకుంటుండగా ఎమ్మెల్యేను పట్టుకున్నామని చెప్పారు. ఏసీబీ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకునేసరికి ఎమ్మెల్యే సహచరుల్లో ఒకరు డబ్బుతో పారిపోయారని తెలిపారు. అయితే తాము అప్పటికే అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో ఈ వ్యవహారమంతా రికార్డయిందని, ఎమ్మెల్యే డబ్బు తీసుకుంటున్న ఆడియో, వీడియో రికార్డింగ్‌ తమ వద్ద ఉన్నదని చెప్పారు. ఇకపోతే, గత అసెంబ్లీ ఎన్నికల్లో బాగిడోరా నియోజకవర్గం నుంచి గెలుపుపొందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మహేంద్రజిత్ మాల్వియా బీజేపీలో చేరారు. ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆయన ఎంపీగా పోటీ చేయడంతో ఆ స్థానం ఖాళీ అయింది. దీంతో జరిగిన ఉప ఎన్నికల్లో జైకృష్ణ పటేల్‌ బీజేపీ అభ్యర్థి సుభాష్ తంబోలియాపై 51 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు.

Next Story