Rahul: సమాధానం చెప్పాల్సిన వారే ఆధారాలు దాచి పెడుతున్నారు.. ఈసీ ప్రకటనపై రాహుల్ ఫైర్

by B.Srinivas |

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని విడుదల చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.

Rahul: సమాధానం చెప్పాల్సిన వారే ఆధారాలు దాచి పెడుతున్నారు.. ఈసీ ప్రకటనపై రాహుల్ ఫైర్
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని విడుదల చేయాలని ప్రతిపక్షాలు కొంత కాలంగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎలక్షన్ కమిషన్ (Election commission) కీలక ప్రకటన చేసింది. ఓటింగ్ కేంద్రాల వెబ్‌కాస్టింగ్‌కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌లను బహిరంగపర్చలేమని స్పష్టం చేసింది. అటువంటి వీడియో కంటెంట్‌ను షేర్ చేయడం వల్ల ఓటరు గోప్యతకు భంగం కలుగుతుందని, అంతేగాక ప్రజాస్వామ్య ప్రక్రియకు సైతం ప్రమాదం వాటిల్లుతుందని తెలిపింది. ఫుటేజీని రిలీజ్ చేయాలనే డిమాండ్లు పారదర్శకతను ప్రోత్సహించేలా కనిపిస్తున్నప్పటికీ, అవి ప్రతికూలమైవని, చట్టబద్ధంగా చెల్లవని పేర్కొంది.

సీసీటీవీ ఫుటేజీని బహిర్గతం చేయడం 1950, 1951ప్రజాప్రాతినిధ్య చట్టంలోని చట్టపరమైన నిబంధనలు, సుప్రీంకోర్టు సూచనలను ఉల్లంఘించడమే అవుతుందని తెలిపింది. ఫుటేజ్‌లను బయటపెట్టడం వల్ల ఎవరు ఓటు వేశారో, ఓటు వేయకుండా ఎవరు ఉన్నారో గుర్తించడానికి వీలు కలుగుతుందని, దీనివల్ల ఓటర్లు బెదిరింపులకు గురవుతారని కమిషన్ పేర్కొంది. ఒక రాజకీయ పార్టీకి ఒక బూత్‌లో తక్కువ ఓట్లు వస్తే, వారి మద్దతుదారులు కానివారిని గుర్తించడానికి ఫుటేజీని సమీక్షించే అవకాశం ఉందని, ఎన్నికల తర్వాత వారు వేధింపులకు గురవుతారని తెలిపింది.

ఆధారాలను నాశనం చేస్తున్నారు: రాహుల్

ఈసీ ప్రకటనపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) స్పందించారు. సమాధానాలు చెప్పాల్సిన వారే ఆధారాలను నాశనం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో రిగ్గింగ్ ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని తెలిపారు. ‘ఓటరు జాబితా? దానిని మెషిన్-రీడబుల్ ఫార్మాట్‌లో అందించరు. సీసీటీవీ ఫుటేజ్ దాచడానికి చట్టాన్ని మార్చారు. ఎన్నికల ఫోటోలు, వీడియోలు ఏడాది పాటు ఉంచే బదులు వాటిని కేవలం 45 రోజుల్లోనే తొలగిస్తారు’ అని తెలిపారు. దీని ద్వారా మ్యాచ్ ఫిక్సింగ్ అయినట్టు స్పష్టం కనిపిస్తోందని విమర్శించారు. కాగా, అంతకుముందు ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన సీసీటీవీ, వీడియోగ్రఫీ వంటి డేటాను ఎటువంటి ఆబ్జెక్షన్ లేకపోతే 45 రోజుల తర్వాత తొలగించొచ్చని ఈసీ ఆదేశించింది.

Next Story