Rahul: విద్యార్థులకు సకాలంలో స్కాలర్‌షిప్స్ అందించాలి.. ప్రధాని మోడీకి రాహుల్ లేఖ

by B.Srinivas |

విద్యార్థులకు అందించే స్కాలర్‌షిప్స్ సకాలంలో అందించాలని లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.

Rahul: విద్యార్థులకు సకాలంలో స్కాలర్‌షిప్స్ అందించాలి.. ప్రధాని మోడీకి రాహుల్ లేఖ
X

దిశ, నేషనల్ బ్యూరో: విద్యార్థులకు అందించే స్కాలర్‌షిప్స్ (Scholorships) సకాలంలో అందించాలని లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న దళిత, గిరిజన, ఓబీసీ, మైనారిటీ విద్యార్థులకు సకాలంలో పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్ ఇవ్వాలని, వారి హాస్టళ్ల పరిస్థితిని మెరుగుపర్చాలని ప్రధాని మోడీని కోరారు. ఈ మేరకు బుధవారం మోడీకి ఓ లేఖ రాశారు. ‘నేను ఇటీవల బిహార్ లోని దర్భంగాలో అంబేడ్కర్ హాస్టల్‌ను సందర్శించారు. అక్కడి పరిస్థితి చూసి షాక్ అయ్యా. ఆరు నుంచి ఏడుగురు విద్యార్థులు చిన్న గదిలో ఉంటున్నారు. మరుగుదొడ్లు శుభ్రంగా లేవు, తాగునీరు సైతం లేదు. లైబ్రరీ, ఇంటర్నెట్ వంటి ప్రాథమిక సౌకర్యాలు కూడా లేవు’ అని తెలిపారు. అంతేగాక బిహార్‌లో స్కాలర్‌షిప్ పోర్టల్ మూడేళ్లుగా మూసివేశారని, దీని కారణంగా వేలాది మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2023లో 1.36 లక్షల మంది విద్యార్థులు స్కాలర్‌షిప్‌లు పొందగా, 2024లో ఈ సంఖ్య కేవలం 69 వేలకు తగ్గిందని తెలిపారు.

ఈ సమస్య కేవలం బిహార్ కు మాత్రమే పరిమితం కాలేదని, దేశ వ్యాప్తంగా ఇవే పరిస్థితి నెలకొందని తెలిపారు. ప్రతి హాస్టల్‌ను ఆడిట్ చేసి, సౌకర్యాలను మెరుగుపరచాలని విజ్ఞప్తి చేశారు. అన్ని హాస్టళ్లలో ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, తగిన నిధులతో ప్రాథమిక మౌలిక సదుపాయాలు, పారిశుధ్యం, ఆహారం, విద్యా సౌకర్యాలను నిర్ధారించడానికి సమగ్ర ఆడిట్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. అట్టడుగు వర్గాల యువత అభివృద్ధి చెందకపోతే భారతదేశం అభివృద్ధి చెందబోదని స్పష్టం చేశారు.

Next Story