రేపే సిద్ధరామయ్య రాజీనామా!.. ఏకైక ఓబీసీ సీఎంను పక్కన పెట్టబోతున్న కాంగ్రెస్.. తెరపైకి కేరళ మోడల్?

by Prasad Jukanti |

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రేపు రాజీనామా చేయనున్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. మే 30న కొత్త సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణం చేసే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.

రేపే సిద్ధరామయ్య రాజీనామా!.. ఏకైక ఓబీసీ సీఎంను పక్కన పెట్టబోతున్న కాంగ్రెస్.. తెరపైకి కేరళ మోడల్?
X

దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటక (Karnataka)రాజకీయం రసతవత్తరంగా మారింది. సీఎం మార్పుపై ఎలాంటి చర్చ జరగలేదని అధిష్టానం పెద్దలు చెబుతున్నప్పటికీ రేపు సిద్ధరామయ్య తన సీఎం పదవికి రాజీనామా (Siddaramaiah Resignation) చేయబోతున్నారనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ మేరకు సిద్ధరామయ్య గవర్నర్ అపాయింట్ మెంట్ సైతం కోరారని ఆయన రాజీనామా అనంతరం కొత్త సీఎంగా డీకే శివకుమార్ ఈ నెల 30వ తేదీన ప్రమాణ స్వీకారం (DK Shivakumar Swearing) చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలను బట్టి సిద్ధరామయ్య స్థానంలో ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్‌కు రాష్ట్ర పగ్గాలు అప్పగించేందుకు కాంగ్రెస్ పెద్దలు సిద్ధమయ్యారని అంతా భావిస్తుండగా రాహుల్ గాంధీ వేసిన సరికొత్త వ్యూహం అందరిని ఆశ్చర్యపరిచేలా చేస్తోంది. సీఎం మార్పుతో పాటే మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేయాలని ఇందుకోసం కేరళ మోడల్ అనుసరించాలని రాహుల్ గాంధీ ప్రతిపాదించినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

ఏకైక ఓబీసీ సీఎంకు పదవి దూరం:

రాహుల్ గాంధీ గత ఎన్నికల నుంచి సామాజిక న్యాయం నినాదంతో ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సీఎంగా ఉన్న ఏకైక ఓబీసీ ముఖ్యమంత్రిని సిద్ధరామయ్యను ఆ పదవి నుంచి తప్పించాల్సి రావడం రాహుల్ గాంధీ (Rahul Gandhi) నినాదానికి ఇదో కీలక పరిణామంగా మారనుంది. ఈ నేపథ్యంలో పార్టీకి డ్యామేజ్ జరగకుండా చూసేందుకు రాహుల్ గాంధీ తన 'సామాజిక న్యాయం' నినాదాన్ని కొత్త కేబినెట్‌లో బలంగా అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న మంత్రివర్గంలో 25 మంది మంత్రులను పక్కన పెట్టి వారి స్థానంలో కొత్తవారికి అవకాశం ఇవ్వాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. నూతన కేబినెట్ కూర్పులో దళితులు, ఓబీసీలు, మైనారిటీలకు పెద్ద పీట వేయాలని తద్వారా సిద్ధరామయ్యకు బలమైన మద్దతుగా ఉన్న 'అహిందా' (AHINDA - దళితులు, వెనుకబడిన తరగతులు, మైనారిటీల కూటమి) ఓటు బ్యాంకు చేజారిపోకుండా చూసుకోవాలనేది హైకమాండ్ ప్లాన్ గా తెలుస్తోంది.

కర్ణాటకలో కేరళ మోడల్!:

రాబోయే 2028 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని యువ ఓటర్లను ఆకర్షించేందుకు కేబినెట్‌లో యువ ముఖాలకు ఎక్కువ అవకాశం ఇవ్వాలని రాహుల్ గాంధీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం 'కేరళ మోడల్'ను అనుసరించాలని నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల కేరళలో కొత్తగా కొలువుదీరిన యూడీఎఫ్ ప్రభుత్వంలోయూత్ కాంగ్రెస్ నేపథ్యం ఉన్న యువ నాయకులకు మంత్రి పదవులు ఇచ్చినట్లుగానే కర్ణాటకలోనూ యువ నేతలకు అవకాశం కల్పించి కేబినెట్ స్థానం కోల్పోబోతున్న మంత్రులకు పార్టీ సంస్థాగత బాధ్యతలు అప్పగించాలనే ఆలోచనతో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఇద్దరు డిప్యూటీ సీఎంలు:

ప్రస్తుతం కర్ణాటకలో సీఎంగా సిద్ధరామయ్య కొనసాగుతుండగా డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ వ్యవహరిస్తున్నారు. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడితే ఇద్దరు ఉపముఖ్యమంత్రులను (Deputy CMs) నియమించాలనే ప్రతిపాదన సిద్ధ రామయ్య వర్గం నుంచి బలంగా వినిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఒకటి దళిత నేతకు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు కర్ణాటక చరిత్రలో దళిత ముఖ్యమంత్రి లేని నేపథ్యంలో ఒక డిప్యూటీ సీఎం పదవిని ఇవ్వడం ద్వారా ఆ సామాజిక వర్గానికి సానుకూల సందేశం పంపాలని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇద్దరు డిప్యూటీ సీఎంల ప్రతిపాదనను డీకే శివకుమార్ వర్గం మాత్రం అంగీకరించడం లేదని తెలుస్తోంది.

Next Story