ప్రధాని మోడీ కళ్లలో భయం కనిపిస్తోంది? భోపాల్లో రాహుల్ గాంధీ హాట్ కామెంట్స్

by Ramesh Naini |

ప్రధాని మోడీ ప్రసంగించేటప్పుడు ఆయన కళ్లలోకి చూడాలని, అక్కడ మీకు స్పష్టంగా భయం కనిపిస్తుందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.

ప్రధాని మోడీ కళ్లలో భయం కనిపిస్తోంది? భోపాల్లో రాహుల్ గాంధీ హాట్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి నిప్పులు చెరిగారు. ప్రధాని నరేంద్ర మోడీ కనీసం కేంద్ర కేబినెట్‌ను కూడా సంప్రదించకుండానే అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేశారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. మంగళవారం మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్‌లో జరిగిన 'కిసాన్ మహా చౌపాల్' వేదికగా రాహుల్ గాంధీ ప్రధానిపై విమర్శల వర్షం కురిపించారు. ఈ ఒప్పందం భారతీయ రైతుల ప్రయోజనాలను తాకట్టు పెట్టడమేనని రాహుల్ మండిపడ్డారు.

రహస్య ఒప్పందం.. ప్రజల డేటా ధారాదత్తం

ఈ డీల్ గురించి ఎవరికీ తెలియకుండా అత్యంత రహస్యంగా నిర్ణయం తీసుకున్నారని, ఇది దేశ రైతుల గుండెల్లో గుచ్చిన బాణం వంటిదని అభివర్ణించారు. ఈ ఒప్పంద పత్రాన్ని వాషింగ్టన్ తన నిబంధనలకు అనుగుణంగా రూపొందించుకుందని, మోడీ ప్రభుత్వం కేవలం తల ఊపిందని విమర్శించారు. ఈ ఒప్పందం ద్వారా దేశ ప్రజల డేటాను ప్రధాని మోడీ అమెరికాకు ధారాదత్తం చేశారని ఆరోపించారు. అమెరికా సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు నేపథ్యంలో, భారత్‌కు నష్టం చేకూర్చే ఈ డీల్‌ను రద్దు చేసే ధైర్యం ప్రధానికి ఉందా? అని రాహుల్ సవాల్ విసిరారు.

ప్రధాని కళ్లలో భయం కనిపిస్తోంది..

యువ కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. మోడీని చూసి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని రాహుల్ హాట్ కామెంట్స్ చేశారు. నరేంద్ర మోడీ ప్రసంగించేటప్పుడు ఆయన కళ్లలోకి చూడాలని, అక్కడ మీకు స్పష్టంగా భయం కనిపిస్తుందని వ్యాఖ్యానించారు. బడ్జెట్ సమావేశాల్లో సమాధానం చెప్పలేక ప్రధాని లోక్‌సభ నుంచి వెళ్లిపోయారని, ఆయన దేశ ప్రయోజనాలను పణంగా పెట్టారని ఆరోపించారు. అలాగే, వివాదాస్పద 'ఎప్‌స్టీన్ ఫైల్స్'లో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ పేరు ఉందని ఆయన అన్నారు. రానున్న రోజుల్లో మరికొంత మంది కేంద్ర మంత్రులు, సీనియర్ నేతల పేర్లు కూడా బయటకు వస్తాయని ఆయన జోస్యం చెప్పారు.

Next Story