- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్నికల వేళ బిగ్ ట్విస్ట్!.. ఆ పార్టికి కాంగ్రెస్ గుడ్ బై చెప్పనుందా?
ప్రముఖ యాక్టర్ విజయ్ కు మద్దతుగా రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.

దిశ, డైనమిక్ బ్యూరో: అసెంబ్లీకి ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది తమిళనాడు రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ప్రధాన పార్టీల మధ్య రాజకీయ యుద్ధం రోజు రోజుకు కొత్త మలుపులు తిరుగుతున్నది. ఇక్కడ మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రయత్నాలు చేస్తుంటే ఈ సారి ఎలాగైనా తమిళనాడులో జెండా ఎగురవేయాలని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో రేస్‍లో నేను కూడా ఉన్నానంటూ కొత్తగా పొలిటికల్ కెరీర్‍లోకి ఎంట్రీ ఇచ్చిన సినీ నటుడు, టీవీకే చీఫ్ విజయ్ దూసుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు తమిళనాడు రాజకీయాలతో పాటు ఇండియా కూటమిలో పెను సంచలనంగా మారింది. రాహుల్ గాంధీ నిర్ణయంతో ఇండియా కూటమిలో చీలిక తప్పదా? అనే చర్చ తెరమీదకు వస్తోంది.
విజయ్‍కు సపోర్ట్ గా రాహుల్:
రాజకీయ రంగ ప్రవేశం చేసిన విజయ్ తాను నటించిన చివరి చిత్రం జన నాయగన్ (తెలుగులో జననాయకుడు) సెన్సార్ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. విడుదలకు అంతా సిద్ధం అయిన వేళ సెన్సార్ సర్టిఫికెట్ ఇష్యూతో రిలీజ్ వాయిదా పడింది. అయితే ఎన్డీయేలోకి విజయ్‍ను లాగేందుకు బీజేపీ ఈ రకంగా ఇబ్బందులు పెడుతోందనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. ఇటువంటి తరుణంలో తాజాగా రాహుల్ గాంధీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. విజయ్ సినిమాకు మద్దతుగా నిలబడ్డారు. ఈ మేరకు ఇవాళ ఎక్స్ వేదికగా విజయ్ సినిమాకు సపోర్టుగా మాట్లాడిన రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కేంద్రంలోని ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‍కాస్టింగ్ శాఖ జన నాయగన్ నిలిపివేయాలనే ప్రయత్నం తమిళనాడు సంస్కృతిపై దాడేని ఆరోపించారు. మిస్టర్ మోడీ.. తమిళ ప్రజల గొంతును అణచివేయడంలో మీరు ఎప్పటికీ విజయం సాధించలేరని ట్వీట్ చేశారు. అంతటితో వదిలేయకుండా ఈ ట్వీట్‌ను రాహుల్ పిన్ చేసి చేసి ఉంచడం రాజకీయంగా కొత్త చర్చకు దారి తీసింది.
డీఎంకేకు కాంగ్రెస్ గుడ్‍బై చెప్పబోతోందా?:
విజయ్‍కు రాహుల్ గాంధీ మద్దతు ఇవ్వడం వెనుక రాజకీయపరమైన కొత్త వ్యూహం ఉండవచ్చనే అనుమానాలను రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జీఎంకేను నిత్యం టార్గెట్ చేసే విజయ్‍కు కాంగ్రెస్ అగ్రనేత మద్దతుగా నిలవడం అంటే టీవీకేతో కాంగ్రెస్ అవగాహన ఒప్పందం కోసమే రాహుల్ ఈ విధంగా చేశారా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. లేకుంటే ఇండియా కూటమిలో కీలకంగా ఉండి తమకు మిత్రపార్టీగా ఉన్నా డీఎంకేను నిత్యం విమర్శలు గుప్పిస్తున్న విజయ్ కు రాహుల్ మద్దతు తెలపడం ఏంటనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం విజయ్ పొలిటికల్ కెరీర్ ఓ జంక్షన్ వద్ద వచ్చి ఆగిన బండిలా మారింది. ఓ వైపు సినిమా విడుదలకు బ్రేక్, మరో వైపు కరూర్ తొక్కిసలాట ఘటనలో సీబీఐ విచారణతో విజయ్ సతమతం అవుతున్నారు. ఇటువంటి సున్నతమైన సమయంలో రాహుల్ గాంధీ టీవీకే చీఫ్‍కు మద్దతుగా నిలవడం అంటే కుచ్ కుచ్ హై అనే చర్చ గుప్పుమంటోంది.
అంత ఈజీ కాదా?:
జరుగుతున్న ప్రచారం ప్రకారం విజయ్‍తో పొత్తు కోసమే రాహుల్ గాంధీ తన మద్దతు తెలిపితే ఇది అంతా ఈజీగా జరిగే పనేనా అనే చర్చ తెరమీదకు వస్తోంది. కాంగ్రెస్ పార్టీకి డీఎంకే మద్దతు సుదీర్ఘ కాలంగా కొనసాగుతోంది. దీంతో చాలా మంది సీనియర్లు డీఎంకేతోనే కలిసి ఉండాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు పార్టీల మధ్య స్నేహం చాలా ఏళ్లుగా ఉందని ఇప్పుడు టీవికే కోసం డీఎంకేను దూరం చేసుకుంటే దాని పర్యవసానాలు బెడిసికొట్టవచ్చనే అభిప్రాయంతో ఉన్నారట. ఇక రాహుల్ గాంధీ ఆలోచన మాత్రం మరోలా ఉందని, యూత్‍లో మంచి క్రేజ్ ఉన్న విజయ్‍ను తమ వైపు తిప్పుకోగలిగితే జెన్ జీ ఓటర్లను ఈజీగా కాంగ్రెస్ వైపు పోలరైజ్ చేయవచ్చని భావిస్తున్నారట. అయితే విజయ్ విషయంలో రాహుల్ గాంధీ అసలు వ్యూహం ఏమిటి డీఎంకేకు దూరమై టీవీకేతో పొత్తు పెట్టుకోవడమా లేక ఇండియా కూటమిలోకే విజయ్‍ను స్వాగతించడమా అనేది తేలాల్సి ఉంది. ఇప్పటికే ఎలాగైనా విజయ్ ను తమ దారిలోకి తెచ్చుకోవాలని బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోందనే ప్రచారం జరుగుతున్న వేళ కాంగ్రెస్ పార్టీ అంతిమంగా ఎలాంటి స్ట్రాటజీ ఉపయోగించబోతున్నది అనేది వేచి చూడాలి.






