అది నా తప్పే.. అప్పట్లో ఓబీసీల సమస్యలు తెలీదు: రాహుల్ గాంధీ

by Phanindra |   (  Updated:2025-07-25 16:45:27  IST  )

21 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో తను చేసిన తప్పు ఒకటేనని రాహుల్ గాంధీ అన్నారు. కులగణన కోసం ఎప్పుడో గళమెత్తాల్సిందని చెప్పారు.

అది నా తప్పే.. అప్పట్లో ఓబీసీల సమస్యలు తెలీదు: రాహుల్ గాంధీ
X

దిశ, నేషనల్ బ్యూరో: కులగణనను గతంలోనే చేయాల్సిందని, అలా జరగకపోవడం తన తప్పేనని కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ వెల్లడించారు. ఆ తప్పునే తాను ఇప్పుడు సరిదిద్దుకుంటున్నానని చెప్పారు. ఢిల్లీలోని తల్కటోరా స్టేడియంలో ఓబీసీల ‘భాగీదారీ న్యాయ్ సమ్మేళన్’ కార్యక్రమంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో చేసిన కులగణన దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

‘నేను 2004 నుంచి రాజకీయాల్లో ఉన్నాను. అంటే 21 ఏళ్లు నిండాయి. ఇప్పుడు వెనక్కు తిరిగి చూసుకుంటే కొన్ని పొరపాట్లు కనిపిస్తున్నాయి. లాండ్ అక్విజషన్ బిల్లు, ఎంజీఎన్‌ఆన్ఈజీఏ, ఆహార బిల్లు, ఆదివాసీల కోసం పోరాటం.. ఈ విషయాల్లో నేను తప్పు చేశారు. దళితులు, ఆదివాసీలు, మైనారిటీల విషయంలో నాకు మంచి మార్కులే పడ్డాయి. మహిళల సమస్యల్లోనూ బాగానే పనిచేశా.

అయితే నా ప్రయాణంలో ఒక్క విషయంలో మాత్రం తప్పు చేశా. ఓబీసీల విషయంలో నేను తప్పు చేశా. వారి కోసం సరిగా పోరాడలేదు’ అని రాహుల్ అన్నారు. 10-15 ఏళ్ల క్రితం ఓబీసీల సమస్యలను తాను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయానని ఆయన ఒప్పుకున్నారు.

‘నేను దళితుల సమస్యలు అర్థం చేసుకున్నా. ఎస్టీల సమస్యలు కూడా స్పష్టంగానే ఉన్నాయి. కానీ ఓబీసీల సమస్యలు మాత్రం ఎవరికీ కనిపించవు. మీ చరిత్ర, సమస్యల గురించి మరింత తెలుసుకొని ఉంటే.. ఎప్పుడే కులగణన చేయించి ఉండేవాడిని. అది కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పు కాదు. నేను చేసిందే. ఇప్పుడు ఆ తప్పును సరిదిద్దుకుంటా’ అని రాహుల్ హామీ ఇచ్చారు.

అదే సమయంలో గతంలో కులగణన జరిగి ఉంటే.. తెలంగాణలో జరిగినట్లు సమగ్రంగా జరిగి ఉండేది కాదని, కాబట్టి అది కూడా ఒకందుకు మంచిదే అయిందని అన్నారు. ఇదే పద్ధతిలో కాంగ్రెస్ పాలిత ప్రాంతాలన్నింటిలో కులగణనతో జనాభాను ఎక్స్‌రే తీస్తామని రాహుల్ పేర్కొన్నారు.

Next Story