పిరికితనమే ఆర్ఎస్ఎస్ మూలసిద్ధాంతం.. రాహుల్ గాంధీ విమర్శలు

by Phanindra |

పిరికితనమే ఆర్ఎస్ఎస్ మూలసిద్ధాంతం అని రాహుల్ గాంధీ విమర్శించారు. కొలంబియాలోని ఈఐఏ యూనివర్సిటీలో ఆయన ప్రసంగించారు.

పిరికితనమే ఆర్ఎస్ఎస్ మూలసిద్ధాంతం.. రాహుల్ గాంధీ విమర్శలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆర్ఎస్ఎస్, బీజేపీ సిద్ధాంతాలు పిరికితనం మీద నిర్మించినవని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ షాకింగ్ కామెంట్స్ చేశారు. కొలంబియాలోని ఈఐఏ యూనివర్సిటీలో ప్రసంగించిన సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా 2023లో చైనా గురించి విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ చేసిన వ్యాఖ్యలను రాహుల్ గుర్తుచేశారు. బలహీనులపై బలప్రదర్శన చేసి, బలవంతులు ఎదురైతే పారిపోవడమే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతమని రాహుల్ విమర్శించారు.

‘చైనా మన కన్నా చాలా బలమైన దేశం. వాళ్లతో నేను గొడవ ఎందుకు పెట్టుకుంటాను?’ అని జైశంకర్ అన్నారని రాహుల్ గుర్తుచేశారు. అలాగే సావర్కర్ తన పుస్తకంలో ఒక ముస్లిం యువకుడిపై దాడి చేసి సంతోషించినట్లు రాశారని కూడా రాహుల్ అన్నారు. ‘ఇలా ఐదుగురు కలిసి ఒక ముస్లిం వ్యక్తిని కొట్టి సంతోషిస్తే అది పిరికితనమే. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం అదే’ అని రాహుల్ తెలిపారు.

ఈ క్రమంలోనే మోడీ ప్రభుత్వాన్ని విమర్శించిన ఆయన.. ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడే భారత్‌లో అతిపెద్ద సవాల్‌గా మారిందన్నారు. ఇంజినీరింగ్, వైద్యరంగంలో భారత్‌కు బలమైన సామర్ధ్యాలున్నాయని చెప్పిన రాహుల్.. అదే సమయంలో కొన్ని సమస్యలు కూడా ఉన్నాయని, వాటిని అధిగమించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

అయితే భారత్‌లో ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడి జరుగుతోందని, అదే అతిపెద్ద సవాల్‌ అని పేర్కొన్నారు. భారత్‌లో పలు మతాలు, సంప్రదాయాలు, భాషలు ఉన్నాయని, వీటిని పాటించే ప్రజల మధ్య జరిగే చర్చే దేశమని రాహుల్ అభిప్రాయపడ్డారు. ఈ చర్చ జరిగేలా చేసే వేదిక ప్రజాస్వామ్యమని, అలాంటి వ్యవస్థపై దాడి జరుగుతోందని ఆందోళన వ్యక్తంచేశారు.

Next Story