పేదలకు సొంతింటి కలలు కనే హక్కు కూడా లేకుండా చేశారు: రాహుల్ గాంధీ

by Phanindra |   (  Updated:2025-06-26 17:29:06  IST  )

పేదలకు సొంతింటి కలలు కనే హక్కు కూడా లేకుండా చేశారని రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు.

పేదలకు సొంతింటి కలలు కనే హక్కు కూడా లేకుండా చేశారు: రాహుల్ గాంధీ
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో పెరిగిపోతున్న ఇళ్ల ధరలపై లోక్‌సభలో విపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తంచేశారు. దేశంలోని బడా సిటీల్లో ఇళ్లు కొనుక్కోవాలంటే ధనవంతులకు కూడా 100 ఏళ్లు పడుతుందని వచ్చిన ఒక వార్తను రాహుల్.. తన వాట్సాప్ ఛానెల్‌లో షేర్ చేశారు. ఈ క్రమంలో ఎన్డీయే ప్రభుత్వంపై పరోక్షంగా చురకలేసిన ఆయన.. ‘ఎవరైనా వచ్చి జీడీపీ లెక్కలు చెప్తే.. వాళ్లకు మీ ఇంటి బడ్జెట్‌లోని వాస్తవాలను చూపించండి’ అన్నారు. మహారాష్ట్రలోని టాప్ 5 శాతం ధనికులు కూడా వందేళ్లు డబ్బు దాచుకుంటేనే ఇల్లు కొనుగోలు చేయగలరని సదరు రిపోర్టు పేర్కొంది.

ఇదే విషయాన్ని ప్రస్తావించిన రాహుల్.. ‘చాలా పెద్ద సిటీల్లో ఇదే పరిస్థితి. ఈ సిటీల్లో అవకాశాల కోసం కష్టపడుతూ ఉంటారు. ఇక సేవింగ్స్ ఎక్కడి నుంచి వస్తాయి?’ అని ప్రశ్నించారు. అలాగే పేద, మధ్యతరగతికి ఆస్తులు దక్కడం లేదన్న ఆయన.. పిల్లల ఖరీదైన చదువులు, జేబుకు చిల్లుపెట్టే చికిత్సలు, తల్లిదండ్రుల బాధ్యత, చిన్న కారు ఇవే దక్కుతాయని చెప్పారు.

‘ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఏదో ఒక రోజు సొంతింటి కలను నిజం చేసుకోవాలని కోరుకుంటారని, కానీ ఆ రోజు రావాలంటే ధనికులకే 109 ఏళ్లు పడుతుందంటే.. ఇక పేదలకు కనీసం కలలు కనే హక్కు కూడా లేనట్లే కదా’ అని రాహుల్ ఆవేదన వ్యక్తంచేశారు. ప్రతి కుటుంబానికీ ఇల్లు ఉండాలని, కానీ జీవితాంతం కష్టపడినా ఇల్లు కొనుక్కోలేని స్థాయికి వాటి ధరలు చేరడం దురదృష్టకరమని అన్నారు.

Next Story