Rahul gandhi: 2024 లోక్‌సభ ఎన్నికల్లో రిగ్గింగ్..రాహుల్ గాంధీ సంచలన ఆరోపణ

by B.Srinivas |   (  Updated:2025-08-02 15:33:52  IST  )

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఎన్నికల సంఘంపై మరోసారి విమర్శలు గుప్పించారు. దేశ ఎన్నికల వ్యవస్థ చచ్చిపోయిందని ఆరోపించారు.

Rahul gandhi: 2024 లోక్‌సభ ఎన్నికల్లో రిగ్గింగ్..రాహుల్ గాంధీ సంచలన ఆరోపణ
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఎన్నికల సంఘంపై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. భారతదేశ ఎన్నికల వ్యవస్థ చచ్చిపోయిందని ఆరోపించారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని, 70 నుంచి100 స్థానాల్లో అక్రమాలు జరిగాయని అనుమామాలున్నాయన్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో కాంగ్రెస్ లీగల్ సెల్ నిర్వహించిన ‘కాన్ స్టిట్యూషనల్ చాలెంజెస్ పర్‌స్పె్క్టివ్ అండ్ పాత్ వేస్’ అనే సదస్సులో రాహుల్ ప్రసంగించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎలా రిగ్గింగ్ జరుగుతుందో రాబోయే రోజుల్లో నిరూపిస్తామన్నారు. 2014కి ముందు నుంచి ఏదో తప్పు జరుగుతుందనే అనుమానాలున్నాయని, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలపైనా తనకు సందేహాలున్నాయని తెలిపారు. కానీ దీనికి సంబంధించిన ఆధారాలను సేకరించలేకపోయామన్నారు. అయితే ఎన్నికల్లో అక్రమాలకు సంబంధించి కాంగ్రెస్ వద్ద ప్రస్తుతం 100 శాతం రుజువు ఉందని, అది బయటపెడితే అణుబాంబు వేసినట్టే అవుతుందన్నారు. ఎన్నికల కమిషన్ ఉనికిలో లేకుండా పోయే ఆధారాలు తమ వద్ద ఉన్నాయని నొక్కి చెప్పారు.

మోడీ చాలా తక్కువ మెజారిటీతో భారత ప్రధాని అయ్యారని,10 నుంచి 15 సీట్లలో రిగ్గింగ్ జరగకపోతే ఆయన ప్రధాని అయ్యేవారే కాదని విమర్శించారు. ఎన్నికల కమిషన్ లాంటి సంస్థ ఉనికిలో లేదని దేశమంతటికీ చూపించే ఆధారాలు మా వద్ద ఉన్నాయని, వీటిని కనుగొనడానికి మాకు 6 నెలల సమయం పట్టిందన్నారు. వాటన్నింటినీ త్వరలోనే బయటపెడతామని హెచ్చరించారు. 6.5 లక్షల మంది ఓటేస్తే, వారిలో 1.5 లక్షల మంది నకిలీ ఓటర్లేనని తెలిపారు. ‘మహారాష్ట్రలో లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమి ఎక్కువ సీట్లు గెలిచింది. కానీ ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ పోల్స్‌లో ఓడిపోయాం. బలమైన మూడు పార్టీలు తుడిచిపెట్టుకు పోయాయి. అప్పటి నుంచి ఎన్నికల దుర్వినియోగంపై పరిశోధించాం. లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల మధ్య మహారాష్ట్రలో కోటిమంది కొత్త ఓటర్లు చేరారు. దీనికి సంబంధించిన ఎవిడెన్స్ తమ వద్ద ఉంది’ అని వ్యాఖ్యానించారు.

అణుబాంబు వెంటనే పేల్చాలి: రాజ్ నాథ్ సింగ్

రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath singh) స్పందించారు. ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా తమ వద్ద ఆధారాలుంటే వెంటనే అణుబాంబు పేల్చాలని సవాల్ విసిరారు. రాహుల్ వద్ద ఆధారాలుంటే వెంటనే బయటపెట్టాలని తెలిపారు. లేదంటే ఎటువంటి ఎవిడెన్స్ లేనట్టేనని స్పష్టం చేశారు. ఆయన పనికిమాలిన ప్రకటనలన్నీ చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల సంఘం పూర్తి పారదర్శకతతో పని చేస్తోందని కొనియాడారు.

Next Story