- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజ్యాంగాన్ని కాపాడుకున్నాం: రాహుల్ గాంధీ
లోక్‌సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడాన్ని ప్రజాస్వామ్య విజయంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అభివర్ణించారు.

దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడాన్ని ప్రజాస్వామ్య విజయంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అభివర్ణించారు. బిల్లుపై ఓటింగ్ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని విపక్షాలు ఐక్యంగా తిప్పికొట్టాయని ఆయన పేర్కొన్నారు. "మహిళా రిజర్వేషన్ల పేరుతో ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర పన్నింది. డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) ద్వారా దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని తగ్గించి, దేశ రాజకీయ ముఖచిత్రాన్ని ఏకపక్షంగా మార్చాలని చూశారు. ఆ ప్రమాదాన్ని మేము పసిగట్టాం, అందుకే ఈ బిల్లును అడ్డుకున్నాం" అని రాహుల్ స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టింది ముమ్మాటికీ మహిళా బిల్లు కాదని, ఇది కేవలం 'డీలిమిటేషన్ బిల్లు' అని ఆయన విమర్శించారు. మహిళా సాధికారత అనేది ఒక సాకు మాత్రమేనని, అసలు లక్ష్యం సీట్ల పెంపు ద్వారా రాజకీయ లబ్ధి పొందడమేనని ఆరోపించారు.
పాత చట్టాన్ని అమలు చేయండి..
నిజంగా మహిళలపై ప్రేమ ఉంటే, ఇప్పటికే ఆమోదం పొందిన 2023 మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని తక్షణమే అమలు చేయండి. దానికి మేం పూర్తి మద్దతు ఇస్తాం. కానీ దానికి డీలిమిటేషన్, జనగణన వంటి ముళ్లు పెట్టవద్దు అని ప్రభుత్వానికి హితవు పలికారు. మహిళా రిజర్వేషన్లకు, డీలిమిటేషన్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ ముడిపెట్టవద్దని, రెండింటినీ వేర్వేరుగా చూడాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఓటింగ్ ద్వారా 'ఇండియా' కూటమి ఐక్యత నిరూపితమైందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కేంద్రం తన మొండి వైఖరిని వీడాలని, దేశ సమాఖ్య స్ఫూర్తిని గౌరవించాలని ఆయన హెచ్చరించారు. బిల్లు వీగిపోవడంతో కాంగ్రెస్ సహా ఇతర విపక్ష పార్టీల శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తుండగా, పార్లమెంట్ పరిసరాల్లో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.






