- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రధాని మోడీ దేశద్రోహి : రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు
ప్రధాని నరేంద్రమోడీపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. మోడీ ఒక దేశ ద్రోహి అని, దేశాన్ని అమెరికాకు అమ్మేస్తున్నారని ఆరోపించారు.

దిశ, వెబ్‌డెస్క్: ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఒక దేశద్రోహి అంటూ.. లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాయ్ బరేలీ పర్యటనలో ఉన్న ఆయన.. మోడీ, అమిత్ షా, RSSలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశాన్ని .. ప్రధాని అమెరికాకు అమ్మేస్తున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నాశనమయ్యేందుకు ఈ ముగ్గురే కారణమని ఆరోపించారు. రాబోయే రోజుల్లో దేశంలో అతిపెద్ద ఆర్థిక తుఫాను రాబోతోందని, అది సామాన్య ప్రజల జీవితాలను పూర్తిగా విధ్వంసం చేస్తుందని హెచ్చరించారు.
ఇప్పటికే దేశంలో రెండుసార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగ్గా.. త్వరలోనే మరోసారి పెట్రోల్ ధరలు పెరగబోతున్నాయని రాహుల్ గాంధీ తెలిపారు. దీని ఫలితంగా నిత్యావసరాలు కూడా సామాన్యులకు అందని ద్రాక్షల్లా మారుతాయన్నారు. అధిక ధరలతో సామాన్య ప్రజలు అల్లాడిపోయే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశాన్ని మోడీ ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలోకి నెట్టి.. ఇప్పుడు తప్పు ఒప్పుకోకుండా తప్పించుకోవాలని చూస్తోందని దుయ్యబట్టారు. ఎన్నికలకు ముందు దేశంలో పెట్రోల్, గ్యాస్‌కు ఎలాంటి కొరత లేదని, ధరలు పెరగవని ప్రగల్భాలు పలికారని రాహుల్ గాంధీ గుర్తు చేశారు. కానీ నేడు పెట్రోల్ ధరలు విపరీతంగా పెరుగుతుంటే, అంబానీ మాత్రం రష్యా నుండి తక్కువ ధరకే ముడి చమురును కొనుగోలు చేసి, ఇక్కడి పెట్రోల్‌ను దేశం దాటించి విదేశాలకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. అలా సంపాదించిన డబ్బుతోనే వారు నరేంద్ర మోదీకి ఫండింగ్ (ఆర్థిక సహాయం) చేస్తున్నారని, ఇదే అసలైన నిజమని ఆయన పేర్కొన్నారు.
"విదేశాలకు వెళ్లవద్దు, బంగారం కొనవద్దు, ఎలక్ట్రిక్ వాహనాలే కొనండి" అంటూ ప్రధాని ప్రజలకు హితబోధ చేస్తున్నారని దుయ్యబట్టారు. సామాన్య ప్రజలను బంగారం కొనవద్దని, విదేశాలకు వెళ్లవద్దని బహిరంగంగా చెప్పే ప్రధానమంత్రి.. తాను మాత్రం స్వయంగా వేల కోట్ల రూపాయల విలువైన ప్రత్యేక విమానాలలో విదేశీ పర్యటనలు చేస్తున్నారని రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు.
కాగా.. ప్రధాని మోడీపై రాహుల్ గాంధీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. ప్రధాని మోదీని 'దేశ ద్రోహి' అనడం ద్వారా రాహుల్ గాంధీ కేవలం ప్రధానమంత్రిని మాత్రమే కాకుండా, ఆయనను గెలిపించిన దేశ ప్రజలందరినీ ఘోరంగా అవమానించారని బీజేపీ నేతలు మండిపడ్డారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేత హోదాలో ఉండి ఇలాంటి దిగజారుడు రాజకీయ వ్యాఖ్యలు చేయడం తగదని, దేశ ప్రతిష్టను దిగజార్చేలా మాట్లాడినందుకు రాహుల్ గాంధీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది.






