- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేశంలో ప్రధాన సమస్యల్ని పట్టించుకోని బడ్జెట్ ఇది : రాహుల్ గాంధీ
2026- 27 ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పార్లమెంట్లో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు.

దిశ, వెబ్‌డెస్క్: 2026- 27 ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పార్లమెంట్లో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. తాజాగా ఈ బడ్జెట్ పై లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ బడ్జెట్ దేశంలో వాస్తవ సంక్షోభాలను పట్టించుకోని బడ్జెట్ అని విమర్శించారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న ప్రధాన ఆర్థిక, సామాజిక సమస్యలను బడ్జెట్ పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. నిరుద్యోగం, తయారీ రంగ వృద్ధి మందగించడం, పెట్టుబడుల ఉపసంహరణ, కుటుంబాల పొదుపు తగ్గుదల, రైతుల కష్టాలు వంటి కీలక అంశాలను ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.
ఉద్యోగాలు లేని యువత, పడిపోతున్న తయారీ రంగం, పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్న పెట్టుబడిదారులు, క్షీణిస్తున్న కుటుంబ పొదుపు, ఇబ్బందుల్లో ఉన్న రైతులు, ప్రపంచ ఆర్థిక సంక్షోభ సూచనలు.. ఇవన్నీ ఈ బడ్జెట్‌లో నిర్లక్ష్యం చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోందని ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.
మధ్యతరగతి వర్గం పూర్తిగా మోసపోయింది : అఖిలేశ్ యాదవ్
ఇదే సమయంలో.. ఇతర ప్రతిపక్ష నేతలు కూడా బడ్జెట్‌పై విమర్శలు చేశారు. దేశ ఆర్థిక వృద్ధిని పునరుజ్జీవింపజేయడానికి, ఉపాధి అవకాశాలు కల్పించడానికి, బలహీన వర్గాలకు ఉపశమనం కల్పించడానికి అవసరమైన నిర్మాణాత్మక సంస్కరణలు ఇందులో లేవని వారు పేర్కొన్నారు.
సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ కూడా బడ్జెట్‌ను తీవ్రంగా తప్పుబట్టారు. బడ్జెట్ కారణంగానే స్టాక్ మార్కెట్ పతనమైందని ఆరోపించారు.“బీజేపీ బడ్జెట్ ఫలితం ఇదే. షేర్ మార్కెట్ భారీగా కుప్పకూలింది. ఆదివారం మార్కెట్ తెరుస్తుందా లేదా అన్నది కాదు, ఎంతగా పడిపోతుందన్నదే ప్రశ్న అని మేము ముందే చెప్పాం” అని ఆయన ‘ఎక్స్’లో వ్యాఖ్యానించారు. ఈ బడ్జెట్ దేశంలోని కేవలం ఐదు శాతం మందికే ఉపయోగపడేలా రూపొందించబడిందని అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. బీజేపీకి అనుకూలంగా ఉన్న వారికి లాభాలు చేకూర్చేందుకు, కమిషన్లు భద్రపరుచుకోవడానికే ఈ బడ్జెట్ ను రూపొందించారని అన్నారు.
ద్రవ్యోల్బణం నియంత్రణ తప్పిన పరిస్థితుల్లో పన్ను రాయితీలు ఇవ్వకపోవడం “పన్ను దోపిడీ”తో సమానమన్నారు. ధనవంతులకు వ్యాపారం, ప్రయాణాల కోసం అనేక రాయితీలు ఇచ్చారని, నిరుద్యోగులకు మాత్రం కేంద్రం మొండిచేయి చూపించిందని వాపోయారు. మధ్యతరగతి వర్గం పూర్తిగా మోసపోయినట్టుగా భావిస్తోందని ఆయన పేర్కొన్నారు. పేదలు, వెనుకబడిన వర్గాలు తగిన సహాయం లేక మరింత వెనుకబడుతున్నాయని అన్నారు. సామాజిక భద్రత పథకాలలో కోతలను కూడా ఆయన విమర్శించారు. అవి కేవలం రూపకల్పన కోసం మాత్రమే ఉన్నాయని, వాస్తవ ప్రయోజనం లేదని తెలిపారు. రైతులు, కూలీలు, కార్మికులు, వ్యాపారులు, చిన్న దుకాణదారులకు ఈ బడ్జెట్‌లో ఎలాంటి ఉపశమనం లేదని అఖిలేశ్ యాదవ్ అన్నారు.






