Rahul Gandhi: బిలియనీర్ స్నేహితుల కోసం రూ.16 లక్షల కోట్లు మాఫీ- రాహుల్ గాంధీ

by Shamantha N |

ప్రతిపక్షనేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బీజేపీపై మరోసారి విరుచుకుపడ్డారు. బీజేపీ ప్రభుత్వ తీరువల్లే బ్యాంకింగ్ రంగం సంక్షోభంలోకి వెళ్లిందన్నారు.

Rahul Gandhi: బిలియనీర్ స్నేహితుల కోసం రూ.16 లక్షల కోట్లు మాఫీ- రాహుల్ గాంధీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రతిపక్షనేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బీజేపీపై మరోసారి విరుచుకుపడ్డారు. బీజేపీ ప్రభుత్వ తీరువల్లే బ్యాంకింగ్ రంగం సంక్షోభంలోకి వెళ్లిందన్నారు. క్రోనిజం, దుర్వినియోగం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. బీజేపీ ప్రభుత్వ ఆర్థిక దుర్వినియోగం మానవ నష్టాన్ని కలిగిస్తుందన్నారు. దీంతో ఒత్తిడి, కఠినమైన పని పరిస్థితులను జూనియర్ ఉద్యోగులు భరించాల్సి వస్తోందన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. “ బీజేపీ ప్రభుత్వం తన బిలియనీర్ స్నేహితుల కోసం రూ. 16 లక్షల కోట్లను మాఫీ చేసింది. ప్రభుత్వ ఆర్థిక దుర్వినియోగం దేశవ్యాప్తంగా వేలాది మంది నిజాయితీపరులైన వృత్తి నిపుణులను ప్రభావితం చేస్తుంది.” అని చెప్పుకొచ్చారు. ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ ప్రతినిధి బృందంతో జరిగిన సమావేశానికి సంబంధించిన వీడియోని షేర్ చేశారు. నిర్వహణ లోపాల వల్ల వీరంతా నష్టపోయారని అన్నారు. కాంగ్రెస్ ఇలాంటి శ్రామిక శక్తుల నిపుణుల కోసం పోరాడుతుందన్నారు. పనిలో వేధింపులు, దోపిడీని అంతం చేస్తామని చెప్పుకొచ్చారు. ‘‘మీరు ఇలాంటి అన్యాయాన్ని ఎదుర్కొన్న వర్కింగ్ ప్రొఫెషనల్ అయితే https://rahulgandhi.in/awaazbharatki కి మీ ఆవేదనను నాతో పంచుకోండి’’ అని రాహుల్ గాంధీ పోస్టు చేశారు.

ఐసీఐసీఐ ఉద్యోగులతో భేటీ

ఐసీఐసీఐ బ్యాంక్ అన్యాయంగా తమను తొలగించిందని ఆరోపిస్తున్న ఉద్యోగులు బృందం శుక్రవారం రాహుల్ గాంధీని కలిసింది. 782 మంది ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ ఉద్యోగుల తరుపున ఒక ప్రతినిధి బృందం పార్లమెంట్‌లో తనతో సమావేశమైందని రాహుల్ చెప్పుకొచ్చారు.‘‘ వీరి కథలు ఆందోళనకరమైన విషయాలను వెల్లడిస్తున్నాయి. కార్యాలయంలో వేధింపులు, బలవంతంపు బదిలీలు, ఎన్‌పీఏ ఉల్లంఘించిన వారికి అనైతిక రుణాలను బహిర్గతం చేసినందుకు ప్రతీకారం, దురుద్దేశంతో తొలగింపులు, విషాదకరమైన సందర్భాల్లో ఇది ఆత్మహత్యకు దారి తీసింది’’ అని అన్నారు.

Next Story