- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rahul Gandhi: రాముడిపై రాహుల్ వ్యాఖ్యలు.. భగ్గుమన్న బీజేపీ నేతలు
కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ‘‘శ్రీరాముడి’’పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ‘‘శ్రీరాముడి’’పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీలోని వాట్సన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ అండ్ పబ్లిక్ అఫైర్స్‌లో జరిగిన డిబేట్ లో రాహుల్ మాట్లాడుతూ.. ‘‘ రాముడు పురాణాలకు చెందిన వ్యక్తి’’గా అభివర్ణించారు. హిందూ జాతీయవాదం ఆధిపత్యం చెలాయించే యుగంలో అన్ని వర్గాలను స్వీకరించే లౌకిక రాజకీయాలు ఎలా రూపొందించాలి..? అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలోని గొప్ప సామాజిక సంస్కర్తలు, ఆలోచనపరులు మతభ్రష్టులు కాదని రాహుల్ బదులిచ్చారు. బీజేపీ ఆలోచనను హిందుత్వంగా తాను పరిగణించనని అన్నారు. ‘‘మన పురాణాల్లోని రాముడు క్షమించే గుణం కలవాడని, బీజేపీ చెప్పేది హిందూ ఆలోచన అని నేను అస్సలు పరిగణించను. హిందూ ఆలోచన అంటే నేను బహుత్వవాదం, ఆలింగనం చేసుకోవడం, ఎక్కువ అప్యాయత, ఎక్కువ సహనం. ప్రతీ దేశంలో అలాంటి ఆలోచన కోసం నిలబడి, జీవించి, ఆ ఆలోచన కోసం మరణించిన వారిని చూశాము. గాంధీ వారిలో ఒకరు.’’ అని రాహుల్ గాంధీ అన్నారు.
బీజేపీ విమర్శలు
అయితే, రాముడు పాత్ర కల్పితం అని అర్థం వచ్చేలా మాట్లాడటంపై బీజేపీ నేతలు భగ్గుమంటున్నారు. రాహుల్ గాంధీ హిందూ వ్యతిరేక మనస్తత్వం కలిగిన వాడని.. రాముడి వ్యతిరేకి అని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఇంటర్వ్యూ లోని ఒక క్లిప్‌ని బీజేపీ షేర్ చేసింది. బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఎక్స్ లో రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. ‘‘హిందువులను, రాముడిని అవమానించడం కాంగ్రెస్ పార్టీ గుర్తింపుగా మారింది. అఫిడవిట్ ద్వారా రాముడి ఉనికిని తిరస్కరించిన వారు, రామమందిర నిర్మాణాన్ని వ్యతిరేకించిన వారు, హిందూ ఉగ్రవాదాన్ని సృష్టించిన వారు.. ఇప్పుడు రాహుల్ గాంధీని ‘పౌరాణికం’ అంటున్నారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ రామమందిర ప్రతిష్టాపనకు హాజరు కాలేదు. ఇది వారి రామ వ్యతిరేక, హిందూ వ్యతిరేక మనస్తత్వాన్ని చూపిస్తుంది. వారు పాకిస్తాన్ భాషను మాట్లాడతారు. సైన్యం నైతికతను దెబ్బతీస్తారు. వారు రాముడికి, భారతదేశానికి వ్యతిరేకులు. ప్రజలు దీన్ని క్షమించరు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి రాహుల్ పై మండిపడ్డారు. ‘‘శ్రీరాముడు కేవలం పౌరాణిక వ్యక్తి: ఇది కాంగ్రెస్ మనస్తత్వం. హిందూ విశ్వాసాలను అపహాస్యం చేయడం, రాముడిని ప్రశ్నించడం, ఎన్నికలు రాగానే సనాతన ప్రేమను నటించడం కాంగ్రెస్ కు అలవాటే. ఆ పార్టీ హిందూ వ్యతిరేకి’’ అని కాంగ్రెస్‌పై ఫైర్ అయ్యారు.






