- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విజయ్ స్థానంలో రాఘవ లారెన్స్ పోటీ! .. పొలిటికల్ ఎంట్రీపై లారెన్స్ కీలక ప్రకటన
తమిళనాడు రాజకీయాల్లో రాఘవ లారెన్స్ ఎంట్రీపై ఊహాగానాలు జోరందుకున్నాయి. సీఎం విజయ్ రాజీనామా చేసిన స్థానం నుండి పోటీపై లారెన్స్ స్పందించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తమిళనాడు రాజకీయాలు సినిమా ఇండస్ట్రీ చుట్టూ తిరుగుతున్నాయి. సినిమా రంగం నుంచి రాజకీయ రంగం లోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ అతి తక్కువ కాలంలోనే సీఎం కుర్చీ అధిరోహించగా తాజాగా ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాఘవ లారెన్స్ సైతం పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. సీఎం విజయ్ రాజీనామా చేసిన తిరుచ్చి ఈస్ట్ నుంచి ఆయన బరిలోకి దిగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఊహాగానాలపై తాజాగా ఎక్స్ వేదికగా స్పందించిన లారెన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
జూన్ 11న కీలక నిర్ణయం:
లారెన్స్ ట్వీట్ చేస్తూ.. తిరుచ్చి ఈస్ట్ ఎన్నికల్లో నేను పోటీ చేస్తున్నాననే వార్తలు వివిధ మీడియా వేదికల్లో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. ఈ విషయంపై స్పష్టత కోరుతూ నా మీడియా మిత్రులు ఫోన్ ద్వారా నన్ను సంప్రదిస్తూ, కలవాలని కోరుతున్నారు. ఈ ఊహాగానాలు ఇప్పుడు నేను స్పందించాల్సిన స్థాయికి చేరుకున్నందున, ఈ నోట్‌ను మీతో పంచుకోవాలని అనుకున్నాను. ప్రస్తుతం నేను ‘బెంజ్’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాను. నా షూటింగ్ షెడ్యూల్ ఈ నెల 10వ తేదీతో ముగుస్తుంది. నా తల్లి ఆశీస్సులతో నా జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని ఈ నెల 11వ తేదీ, గురువారం ఉదయం 9:30 గంటలకు ప్రకటిస్తాను అని ట్వీట్ చేశారు.
త్రిషకు నో చాన్స్!:
టీవీకే అధినేత, సీఎం విజయ్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేసి రెండు చోట్ల విజయం సాధించారు. దీంతో ఒక చోట రాజీనామా చేయాల్సిన అనివార్యత ఏర్పడింది. దీంతో తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గానికి రాజీనామా సమర్పించారు. అయితే ఈ స్థానాన్ని తిరిగి ఎలాగైనా తమ ఖాతాలోనే వేసుకోవాలని భావిస్తున్న టీవీకే అందుకు సమర్థవంతమైన అభ్యర్థి కోసం వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలో రాఘవ లారెన్స్ పేరును ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజల్లో మంచి గుర్తింపు, ఆదరణ ఉన్న బలమైన వ్యక్తి కావడంతో లారెన్స్ వైపు విజయ్ మొగ్గు చూపుతున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ స్థానం నుంచి ప్రముఖ నటి త్రిషకు అవకాశం ఇస్తారనే ఊహాగానాలు సైతం వినిపించాయి. కానీ టీవీకే అధిష్టానం మాత్రం లారెన్స్ పేరును పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.






