- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేను సరైన వ్యక్తిని.. ఇన్నాళ్లు తప్పుడు పార్టీలో కొనసాగా: రాఘవ్ చద్దా సంచలన వ్యాఖ్యలు
దేశ రాజధాని రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) లో నంబర్-2గా భావించే రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా ఆ పార్టీకి గుడ్ బై చెప్పి భారతీయ జనతా పార్టీ (BJP) తీర్థం పుచ్చుకున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) లో నంబర్-2గా భావించే రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా ఆ పార్టీకి గుడ్ బై చెప్పి భారతీయ జనతా పార్టీ (BJP) తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతో పాటు మరో ఆరుగురు రాజ్యసభ ఎంపీలు కూడా బీజేపీలో చేరడంతో ఆప్ పార్లమెంటరీ పార్టీ దాదాపుగా ఖాళీ అయింది. దీంతో రాజ్యసభలో ఆప్‌కు ఉన్న 10 మంది ఎంపీల్లో 7 మంది (2/3 వంతు) బీజేపీలో చేరారు. దీంతో ఫిరాయింపుల నిరోధక చట్టం నుంచి రక్షణ పొందేలా వారు తమ బృందాన్ని బీజేపీలో విలీనం చేస్తున్నట్లు రాజ్యసభ చైర్మన్‌కు లేఖ సమర్పించారు.
బీజేపీలో చేరిన ప్రముఖులు..
1. రాఘవ్ చద్దా
2. స్వాతి మాలివాల్
3. హర్భజన్ సింగ్
4. సందీప్ పాఠక్
5. అశోక్ మిట్టల్
6. రాజిందర్ గుప్తా
7. విక్రమ్ సాహ్నీ
నేను సరైన వ్యక్తిని.. తప్పుడు పార్టీలో ఉన్నాను
బీజేపీలో చేరిన అనంతరం రాఘవ్ చద్దా విలేకరుల సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. "నేను 15 ఏళ్ల నా యవ్వనాన్ని, రక్తాన్ని ధారపోసి ఆప్‌ను నిర్మించాను. కానీ ఇప్పుడు ఆ పార్టీ తన సిద్ధాంతాలను వదిలేసి, కేవలం అవినీతి పరుల చేతుల్లోకి వెళ్లిపోయింది. దేశ ప్రయోజనాల కంటే సొంత ప్రయోజనాలకే అక్కడ పెద్దపీట వేస్తున్నారు. ఇన్నాళ్లు నేను సరైన వ్యక్తిని అయి ఉండి, తప్పుడు పార్టీలో ఉన్నానని అర్థమైంది," అని ఆయన పేర్కొన్నారు. ఇటీవలే రాఘవ్ చద్దాను రాజ్యసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి నుంచి ఆప్ తొలగించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచే ఆయన పార్టీ మారుతారనే ప్రచారం జరిగింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో, పార్టీకి వెన్నెముకగా ఉన్న రాఘవ్ చద్దా, స్వాతి మాలివాల్, హర్భజన్ సింగ్ వంటి వారు దూరం కావడం అరవింద్ కేజ్రీవాల్‌కు పెద్ద ఎదురుదెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు, ఆప్ ఈ పరిణామాలపై మండిపడింది. రాఘవ్ చద్దాను పార్టీ అన్ని విధాలా ఆదరించిందని, కానీ ఆయన బీజేపీ అడుగులకు మడుగులు వత్తుతున్నారని ఆప్ నేతలు విమర్శించారు.






