Putin: మేక్ ఇన్ ఇండియా పాలసీ భేష్.. రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రశంసలు

by B.Srinivas |

మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘మేక్ ఇన్ ఇండియా’ పాలసీపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రశంసలు కురిపించారు.

Putin: మేక్ ఇన్ ఇండియా పాలసీ భేష్.. రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రశంసలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘మేక్ ఇన్ ఇండియా’ (Make in india) పాలసీపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Puthin) ప్రశంసలు కురిపించారు. మేక్ ఇన్ ఇండియా విధానం వల్ల భారతదేశంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో స్థిరత్వం ఏర్పడిందని కొనియాడారు. దేశ ఆర్థిక వ్యవస్థను కూడా బలోపేతం చేసిందని తెలిపారు. రష్యా రాజధాని మాస్కోలో తాజాగా జరిగిన వీటీవీ ఇన్వెస్ట్‌మెంట్ ఫోరం కార్యక్రమంలో పుతిన్ ప్రసంగించారు. భారత్ మేక్ ఇన్ ఇండియా ప్రచారం, రష్యా ఇంపోర్ట్ ప్రోగ్రామ్ ఒకేలా ఉన్నాయన్నారు. ‘భారత ప్రధాని మోడీ(Pm modi)కి మేక్ ఇన్ ఇండియా అనే విజన్ ఉంది. మేము కూడా భారత్‌లో మా తయారీ కార్యకలాపాలను ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మోడీ ప్రభుత్వం భారతదేశానికి మొదటి స్థానం ఇవ్వాలనే విధానంతో పనిచేస్తోంది. కాబట్టి భారత్‌లో పెట్టుబడులు పెట్టడం లాభదాయకమని మేము నమ్ముతున్నాం’ అని వ్యాఖ్యానించారు.

తయారీ రంగాన్ని ప్రోత్సహించడం, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా చేపట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశ స్థానాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించిందని ప్రశంసించారు. బ్రిక్స్ దేశాల్లో చిన్న మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధిని ప్రోత్సహించాలని నొక్కి చెప్పారు. రష్యా మార్కెట్‌లో కొత్త రష్యన్ బ్రాండ్‌లు తమ స్థానాన్ని సంపాదించుకుంటున్నాయని తెలిపారు.

Next Story