Punjab: భారత ఆర్మీ సమాచారం పాక్ కు లీక్.. పంజాబ్‌లో ఇద్దరు యువకుల అరెస్ట్ !

by B.Srinivas |

పహెల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.

Punjab: భారత ఆర్మీ సమాచారం పాక్ కు లీక్.. పంజాబ్‌లో ఇద్దరు యువకుల అరెస్ట్ !
X

దిశ, నేషనల్ బ్యూరో: పహెల్గాం (Pahelgam) ఉగ్రదాడి అనంతరం భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. పంజాబ్‌లోని అమృత్‌సర్ (Amruthsir) పోలీసులు తాజాగా గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలతో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. వీరిద్దరూ భారత్ ఆర్మీ సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేస్తున్నట్టు ఆరోపించారు. అమృత్‌సర్‌లోని ఆర్మీ కంటోన్మెంట్, వైమానిక దళ స్థావరానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్‌కు పంపుతున్నట్టు తెలిపారు. అరెస్టైన ఇద్దరు నిందితులను పాలక్ షేర్ మాసిహ్, సూరజ్ మాసిహ్‌గా గుర్తించారు. ఇద్దరికీ పాక్ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నట్టు విచారణలో వెల్లడైంది. వారి నుంచి రెండు ఫోన్లను స్వాధీనం చేసుకుని పరిశీలించగా సైనిక శిబిరాలు, వైమానిక స్థావరాల ఛాయాచిత్రాలను పాక్ పంపించినట్టు గమనించారు.

అమృత్‌సర్ జైలులో ఉన్న హర్‌ప్రీత్ సింగ్ అలియాస్ పిట్టు అలియాస్ హ్యాపీ ద్వారా వారిద్దరూ ఐఎస్‌ఐతో సంబంధాలు కలిగి ఉన్నట్టు భావిస్తున్నారు. ఈ విషయాన్ని పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ ధ్రువీకరించారు. నిందితులపై దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. జాతీయ ప్రయోజనాలను పరిరక్షించే విధిలో పంజాబ్ పోలీసులు భారత సైన్యంతో దృఢంగా నిలుస్తారని స్పష్టం చేశారు. సాయుధ దళాల భద్రతను దెబ్బతీసే ప్రయత్నాలను సహించబోమని హెచ్చరించారు. నిందితులపై అధికారిక రహస్యాల చట్టం కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు.

Next Story